‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతు మామిడి పండన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ఉంది రేవంత్ సర్కారు తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం తన కపటత్వాన్ని కర్షకుల కళ్లకు కట్టడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇచ్చిన రూ.10 వేల రైతుబంధును గుర్తుచేసుకుంటున్నారు. అదే సమయంలో రైతుభరోసా పేరిట రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నమ్మబలికి ఏడాది తర్వాత తన నైజాన్ని బయటపెట్టుకోవడంపై గుర్రుగా ఉన్నారు.
శనివారం నాటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం ‘రైతుభరోసా కింద ఎకరానికి రూ.12 వేలే ఇస్తాం’ అంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డే ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతుభరోసాకు ఎగనామం పెట్టారంటూ తీవ్ర అసహనంగా ఉన్నారు. ‘కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల సాక్షిగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌కు మంగళం పాడినట్లేనా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘మా ఓట్లు కొల్లగొట్టేందుకే తప్పుడు వాగ్దానాలు ఇచ్చారా?’ అంటూ నిలదీస్తున్నారు.
-ఖమ్మం వ్యవసాయం, జనవరి 5
అన్నదాతల నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు నిలువునా వమ్ముచేసింది. రైతుల పంటల పెట్టుబడికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తోందని, తాము అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరిట రూ.15 వేలు ఇస్తామని అన్నదాతలకు ఆశలు కల్పించింది. దీంతో అన్నదాతలు కూడా ఆ హామీలను నమ్మి ఏడాది క్రితం నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా ఇవ్వనేలేదు. తీరా శనివారం నాడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కర్షకులకు కన్నీళ్లు తెప్పించారు. నమ్మి మోసపోయామనుకునేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర పెద్దల సాక్షిగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌కు నిలువునా తూట్లు పొడిచారు.
రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాదిపాటు సాగదీసి.. శనివారం నాడు స్పష్టతనిచ్చింది. ఎకరానికి రూ.15 వేల హామీని గట్టున పెట్టింది. కేవలం రూ.12 వేలే అంటూ తేల్చిచెప్పింది. అందులోనూ వ్యవసాయానికి యోగ్యమైన భూములకేనంటూ మెలికిపెట్టింది. దీంతో ఏడాది కాలంగా గంపెడాశలతో ఉన్న హలధారులు ఒక్కసారిగా నిట్టూర్చారు. అయితే, ఆ రూ.12 వేలను కూడా ఈ నెల 26 నుంచి అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. పెండింగ్‌లో ఉన్న రెండు సీజన్ల పంటల పెట్టుబడిని అదే రోజున జమ చేస్తారోలేదో స్పష్టతనివ్వలేదంటూ అన్నదాతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రుణమాఫీని కొందిరికి మాత్రమే అమలుచేసిన ఉదంతాన్ని అనుభవించిన అన్నదాతలు ఇప్పటి రైతుభరోసాను కూడా ఎలా అమలు చేస్తారోనంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. తరువాత 2024 యాసంగి, 2025 వానకాలం సీజన్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు 2025 యాసంగి ప్రారంభమైంది. నాట్ల ప్రక్రియ కూడా పూర్తి కావస్తోంది. అయితే ఇటీవలి ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న రైతుభరోసా పంపిణీలో ‘కేవలం తాజా సీజన్‌కు మాత్రమే జమ చేస్తారా? లేక గడిచిన రెండు సీజన్లతోపాటు తాజా సీజన్ పెట్టుబడిని కూడా కలిపి జమ చేస్తారా?’ అంటూ అన్నదాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ‘ఈ పెట్టుబడిని కౌలురైతులకు వర్తింపజేస్తారా? లేదా?’ అనేది కూడా తేలాల్సి ఉంది.
ఉమ్మడి పాలనలోని అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చేందుకు, దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకం దేశ చరిత్రలోనే అద్భుత పథకంగా ఖ్యాతి గడించింది. పంటలు సేద్యం చేసేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా అన్నదాతలకు ముందుగానే పంటల పెట్టుబడిని సాయాన్ని అందించే ఈ పథకాన్ని ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయి. ప్రపంచంలో ఎక్కడా ఇదివరకెప్పుడూ ఇలాంటి పథకం లేదంటూ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను కీర్తించాయి.
పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో అప్పటి మాట ప్రకారం ఎకరానికి రూ.8 వేలను రైతుబంధు పథకం పేరిట పంటల పెట్టుబడి సాయాన్ని అందించిన కేసీఆర్.. ఆ తరువాత ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యే వరకూ నిరాటంకంగా అందించారు.
దీంతో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఏటా సుమారు 3 లక్షల మంది రైతులకు ఒక్కో సీజన్‌కు రూ.350 కోట్ల చొప్పున రూ.3,831.46 కోట్లను అందించారు. దీంతో విత్తనాలు, ఎరువులు ముందుగానే కొనుగోలు చేసుకున్న రైతులు.. ఎవరి దగ్గరా చేయి చాచకుండా వ్యవసాయాన్ని పండుగలా చేశారు. గణనీయమైన దిగుబడులు సాధించి తెలంగాణను అన్నపూర్ణగా నిలిపారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు, మూడు సీజన్లుగా అన్నదాతలను మళ్లీ అప్పులపాలు చేసింది.
09