రఘునాథపాలెం/మామిళ్లగూడెం, జూన్ 13 : ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీసీడీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో కలిసి పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, కో ఆపరేటివ్ అధికారులకు భూభారతి చట్టంపై శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి ద్వారా భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని, భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై ప్రజలకు అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం భూభారతి చట్టం కల్పించిందన్నారు.
గతంలో కేవలం సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే లభించే పరిష్కారం నేడు రెవెన్యూ వ్యవస్థ దగ్గర అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్, సాదాబైనామా సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి గంగాధర్, డీసీసీబీ సీఈవో వెంకట ఆదిత్య, వరంగల్ తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ వైస్ ప్రిన్సిపల్ రాజయ్య, కో ఆపరేటివ్ అధికారులు పాల్గొన్నారు.