ముదిగొండ, మే 26: జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన్ను ఇటు పడింది. ముదిగొండ మండలంలో రాజకీయ నాయకుడి నుంచి రియల్టర్ అవతారమెత్తిన ఓ అక్రమార్కుడు భూ కబ్జాల పర్వానికి మళ్లీ తెరలేపి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పూర్తి వివరాల్లోకెళ్తే.. అతనొక పార్టీలో సాధారణ కార్యకర్త. ఏళ్ల తరబడి పార్టీలో ఉండి అవకాశం వచ్చినప్పుడు పలు పదవులు అనుభవించాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదనకు భూ ఆక్రమణల మార్గం ఎంచుకున్నాడు.
కొంతమంది గ్రూపుగా ఏర్పడి భూముల దందాను ప్రారంభించారు. మొదట ప్రభుత్వ భూములకు పట్టా పొంది వాటిని విక్రయించి భారీగా డబ్బులు గడించారు. అధికారులకు భారీగా ముడుపులు ఇవ్వడంతో వీరి పనులు అత్యంత సులువుగా అయ్యేవి. ఓ అధికారి వీరితో పార్ట్నర్గా చేరాడనే ఆరోపణలూ వినిపించాయి. వివాదాలు, లిటిగేషన్లు ఉన్న భూములను తక్కువ ధరకు కొని అధిక ధరకు అమ్ముకుని రూ.కోట్లు గడించారు. వీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడంతో మరింతగా రెచ్చిపోయారు.
ఎవరైనా అడ్డొస్తే దాడులు కూడా చేశారు. ఓ భూ వివాదంలో ఒక రైతును పట్టపగలే రోడ్డుపైన హత్యచేసే ప్రయత్నం చేశారు. ఇటీవల మరో వ్యక్తిపై అర్ధరాత్రి సమయంలో దాడిచేసి హత్యాయత్నం చేశారు. వీరి అక్రమాలపై పలువురు ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోలేదు. నిషేధిత భూములకు కూడా పట్టాలు చేయించి విక్రయించారు. ఒక భూమి విషయంలో పెద్ద గొడవలై వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోగా.. తరువాత పార్టీ నుంచి ఆ అక్రమార్కుడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్నాడు. గత ఏడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ అక్రమార్కుడికి బలాన్ని ఇచ్చాయి. ఏం ఒప్పందం జరిగిందో కానీ అధికార పార్టీ అభ్యర్థికి బాహాటంగానే మద్దతు పలికాడు.
గతంలో వీరిపై పోరాటం చేసి వీరికే మద్దతు ఇవ్వడం పట్ల జనాలు ముకున వేలేసుకున్నారు. ఈ మద్దతు వెనుక అంతరార్థం బయటపడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే మండల కేంద్రం ముదిగొండలోని రూ.కోట్లు విలువ చేసే 5.27 ఎకరాల పట్టా భూమి రాత్రికిరాత్రే సదరు అక్రమార్కుడి కుటుంబ సభ్యుల పేరున పట్టాకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితులు వెంటనే గుర్తించి రెవెన్యూ అధికారులను అడిగితే.. టెక్నికల్ సమస్య వల్ల ఇలా జరిగిందని, తమకేమీ తెలియదని బుకాయించారు.
తమ భూమి తమకు తిరిగి పట్టా చేయాలని అడిగితే అనేక సాకులు చెబుతూ దాటవేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం సదరు భూమిని పరిశీలించి వెళ్లారు. సదరు అక్రమార్కుడు మాత్రం తన కష్టార్జితంతో ఆ భూములు కొన్నానని, ఎవరినీ మోసం చేయలేదని బుకాయిస్తున్నాడు. తాను నయీం లాంటి వాడిననీ, తన జోలికి వచ్చిన ఎందరికో అథోగతి పట్టిందని, మీకు కూడా అదే గతి పడుతుందని బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు అధికార పార్టీ వత్తాసు పలకడం ఏమిటని, ప్రజాపాలన అంటే అక్రమార్కులకు కొమ్ముకాయటమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు వ్యక్తి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.