– ఏదులాపురం 23వ వార్డు ఇందిరమ్మ కాలనీ దుస్థితి
ఖమ్మం రూరల్, జూలై 06 : సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు అంటే అన్ని వీధులకు సైడ్ కాల్వలు ఉండడం సహజం. కానీ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ వార్డులో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒక్క సైడ్ కాల్వ కూడా లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ కాలనీ 23వ వార్డులో ఉండగా ఇటీవల వార్డు కౌన్సిలర్ గా గెలిచిన అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. 23వ వార్డులో ఇందిరమ్మ కాలనీ ఉంది. ఈ కాలనీలో సుమారు 600 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు కూత వేటు దూరంలో, ఏదులాపురం మున్సిపల్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న ఈ కాలనీ పట్ల యంత్రాంగం నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా మురుగు కాల్వలు లేకుండా ఉంది. అయితే ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ అభివృద్ధికి రూ.75 కోట్లు నిధులను ప్రకటించడం జరిగింది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు మున్సిపాలిటీ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల్లో రూ.10 కోట్ల వ్యయంతో సైడ్ కాల్వల నిర్మాణం చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రాంతం నుండి గెలుపొందిన వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్ పర్సన్ కావడంతో సైడ్ కాల్వల నిర్మాణం లాంచనమే కానుందని భావించారు. అయితే నూతన ప్రతిపాదనలో సైతం ఇందిరమ్మ కాలనీకి ఒక్క సైడ్ కాల్వ నిర్మాణం ప్రతిపాదన లేకపోవడంతో మరోసారి స్థానికులు నిరాశకు గురయ్యారు. ఇప్పటికైనా చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ స్థానికుల ఇబ్బందులను పరిగణకు తీసుకుని సగం వీధులకైన మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నారు, ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.