ఖమ్మం సిటీ, నవంబర్ 2 : విద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వం పెరగడంతోపాటు వారిలో క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ క్రీడలతో దేశ ప్రతిష్ట సైతం పెరుగుతుందనే వాస్తవాన్ని ప్రతీ క్రీడాకారుడు గమనించాలని సూచించారు. కేయూ పరిధిలో నిర్వహిస్తున్న క్రీడల విజయవంతానికి పలు రకాల కమిటీలు వేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు దశల్లో జరిగిన పోటీల్లో దాదాపు వెయ్యి మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభను చాటి వెలుగులోకి వచ్చారని వెల్లడించారు.
జిల్లా యువజన, క్రీడల అధికారి టీ సునీల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్రీడా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి యూపీసీఈ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్ అధ్యక్షత వహించగా.. కేయూ పీడీల సంఘం కార్యదర్శి డాక్టర్ బీ వెంకన్న, పీ శ్రీనివాస్, కోటి, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, కార్యదర్శి ఎండీ షఫీ, పీడీలు శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్, ఏటీబీటీ ప్రసాద్, జే ఉపేందర్, సావిత్రి, లక్ష్మీకాంత్, సుధాకర్ పాల్గొన్నారు.
పురుషుల 100 మీటర్ల పరుగుపందెంలో.. : ఏ గౌతమ్(కేఎండీసీ, ఖమ్మం), బీ అంజి(కేడీసీ హనుమకొండ), ఎస్కే లాల్‌పాషా(కేడీసీ, ఖమ్మం). మహిళల 100 మీటర్ల పరుగుపందెంలో.. : ఏ మైథిలి(ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్, ఖమ్మం), ఎస్కే అఫ్రీన్(కేఎండీసీ, ఖమ్మం), అమ్నా అంజుమ్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల), 4) ఎం.మనీషా (టీఎస్డబ్ల్యూఆర్డీసీ, ఖమ్మం), 5) వీ శృతి(టీటీఎన్ఆర్డీసీ కొత్తగూడెం).