ఖమ్మం, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, మండల కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు.
మొక్కలు నాటి కేటీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం కేక్ కట్ చేశారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరకగూడెంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అశ్వారావుపేలోని సత్యసాయిబాబా కల్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు.
ఇల్లెందులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మధిరలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పాత కొత్తగూడెం పాఠశాలలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. లేకున్నా కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు పిలుపునివ్వడం మంచి పరిణామమన్నారు. సామాజిక సేవలో నిత్యం ముందుండే కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు.