బోనకల్లు, డిసెంబర్ 26: బోనకల్లుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కలిసి తమపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై పెడుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి వివరించారు. అనంతరం ఆళ్లపాడు సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ బోనకల్లు మండలంలో 5 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు గెలవడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని, డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం కావడంతో అధికార గర్వంతో దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.
ఆళ్లపాడులో కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి, తిరిగి బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేయిస్తున్నారని, ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని వివరించామన్నారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలతో ప్రజలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ తరఫున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. కార్యకర్తలకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, చట్టపరంగా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు పారా ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, కృష్ణారావు ఉన్నారు.