చండ్రుగొండ, మార్చి 6 : మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో తమ పంట భూములకు సీతారామ జలాలు వచ్చాయనే ఆనందంలో రైతులు బెండాలపాడు శివారు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద కేసీఆర్ చిత్రపటానికి గురువారం జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, జై తెలంగాణ, జైజై కేసీఆర్ అంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో నినదించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కోసం మాజీ సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే.. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని, కాల్వ నిర్మాణం జరగకుండా భూ సేకరణను సైతం అడ్డుకున్నదని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం తమ గొప్పే అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
సీతారామ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఒక్క ట్రయల్ రన్ మాత్రమే వారు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు కొణకండ్ల వెంకటరెడ్డి, దారా బాబు, సంగొండి రాఘవులు, నరుకుళ్ల సత్యనారాయణ, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి ధనలక్ష్మి, మేడా మోహన్రావు, సూర వెంకటేశ్వరరావు, కుంజా సావిత్రి, పూసం వెంకటేశ్వర్లు, పాండ్ల అంజన్రావు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, కళ్లెం వెంకటేశ్వర్లు, చాపలమడుగు రామరాజు, సయ్యద్ బాద్షా, యాకూబ్, నరుకుళ్ల అప్పాజి, శ్రావణ్ పాల్గొన్నారు.