– అక్టోబర్ 2 నుండి జాతర ప్రారంభం
– ఏర్పాటు పూర్తి చేస్తున్న దేవాదాయ శాఖ
కారేపల్లి, సెప్టెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రంలో జరిగే అమ్మవారి జాతరలో మేడారం తర్వాత రెండవ పెద్దదిగా చెప్పుకునే కోటమైసమ్మ తల్లి మహా జాతర అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లిలో గల కోటమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో ప్రతీ ఏటా విజయ దశమిని పురస్కరించుకుని వారం రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కొలిచిన భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధికెక్కిన కోటమైసమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22 నుండి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ స్థల పురాణం చరిత్ర ఖమ్మం జిల్లా, సింగరేణి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల క్రితం నాటి గుట్టమీద దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండేది. అక్కడ పశువులు కాసే కాపరులు ఈ పులుల నుండి పశువులను కాపాడాలని భగవంతుడిని ప్రార్థిస్తే అమ్మవారి రూపంలో ఆ పశువుల కాపరులకు కనిపించి పులుల నుండి పశువులను కాపాడటం జరిగింది. అమ్మవారు ఒక పశువుల కాపరికి కలలో కనిపించి కోటను నిర్మించమని ఆజ్ఞాపించడంతో పశువుల కాపరులు కోటను నిర్మించి కోటమైసమ్మ అమ్మవారిగా నామకరణం చేశారు. ఆ ప్రదేశం నుండి గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి ఒక మంచినీటి బావిలో సొరంగం ఉంది. ఆ మంచినీటి బావి నుండి మంచినీరు త్రాగటానికి తీసుకెళ్లేవారు.
Karepally : కొలిచిన వారి కొంగు బంగారం కోటమైసమ్మ తల్లి
ఉసిరికాయలపల్లి నుండి ఇల్లెందుకు కాలినడక మార్గం కలదు. ఓ రోజు పర్సా కృష్ణారావు రామచంద్రయ్య పటేల్ దారి బాటన వెళ్తుంటే 1948లో రజాకార్లు వెంబడించారు. వీరి నుండి రక్షిస్తే అమ్మవారికి గుడి కట్టిస్తానని మనసులో అనుకున్నారు. ఇప్పచెట్టు గుహలో దాక్కున్నారు. వారి నుండి రక్షించబడి, అమ్మవారిని ఈ ప్రదేశం నందు బొమ్మల నర్సయ్య శిల్పిచే అమ్మవారిని శిలగా చెక్కించి ఈ ప్రాంత దొర అయిన పర్సా కృష్ణారావు- దమయంతి దంపతులు ప్రతిష్ఠించి నిర్మించడం జరిగింది. అదేక్రమంలో ఆనాటి నుండి ప్రతియేటా పర్సా కృష్ణారావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేవారు. తదనంతరం వారి కుమారుడు డాక్టర్ పర్సా పట్టాభి రామారావు – విజయలక్ష్మి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతూ నవరాత్రులు, జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కోటమైసమ్మ జాతర ఏర్పాట్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. వారం రోజులు పాటు కొనసాగనున్న జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు సదుపాయాలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మహిళా భక్తులకు తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తాగునీటి కోసం జాతరలో పలు చోట్ల చలి వేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Karepally : కొలిచిన వారి కొంగు బంగారం కోటమైసమ్మ తల్లి