MLA Kunamneni | కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 11 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం ఎమ్మెల్యే పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం గ్రామానికి వెళ్ళే రోడ్డును మున్సిపల్, సింగరేణి, ఎలక్ట్రికల్, మిషన్ భగీరధ అధికారులతో కలిసి పరిశీలించారు. శేషగిరినగర్ గ్రామానికి వెళ్లే ఈ ప్రధాన రోడ్ అంతా గతుకుల మయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతుండగా, ఈ రోడ్ నిర్మాణానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సుమారు రూ.2.50కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
డబుల్ లైన్ రోడ్ వేయాలంటే భారీ వృక్షాలు అడ్డుగా ఉన్నాయని, అదే విధంగా ఈ శేషగిరినగర్ గ్రామం మీదుగా పట్టణానికి మిషన్ భగీరథ పైపులైన్ సైతం ఉందని దీనిపై చర్చించి ఏ విధంగా పనులు చేపట్టాలనే అంశంపై చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీలైనంత తొందరలోనే క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని, అదే విధంగా బస్టాండ్ సెంటర్ నుంచి రైటర్ బస్తీలోని త్రిమాతా శక్తి దేవాలయం వరకు రోడ్ వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాత, సింగరేణి డీవైజీఎం(సివిల్) సూర్యనారాయణ, ఎస్ఈ రాజేంద్రప్రసాద్, టీఎస్ఎన్పీడీసీఎల్ డీఈ రంగస్వామి, ఏడీఈ హేమచంద్రబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, వంగా వెంకట్, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.