చుంచుపల్లి, ఆగస్టు 25 : ఫెర్టిలైజర్ షాపు లైసెన్స్ విషయంలో యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీఏ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం ఉల్వనూరులో ఫెర్టిలైజర్ షాపు తనిఖీలకు ఏడీఏ నరసింహారావు వెళ్లిన సమయంలో షాపుకు లైసెన్స్ లేదని చెప్పి యజమానిని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో యజమాని తాను అంత ఇచ్చుకోలేనని, రూ.25 వేలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. వారు చెప్పిన పథకం ప్రకారం.. ఫెర్టిలైజర్ షాపు యజమాని రూ.25 వేలు విద్యానగర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏడీఏ నరసింహారావుకు ఇస్తుండగా.. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వివరించారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా చట్టబద్ధంగా పనిచేయాలి కానీ, డబ్బులు అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064, లేదా 9154388981కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.