
తిరుమలాయపాలెం, ఆగస్టు, 15: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని చంద్రుతండాలో శనివారం జరిగిన ఓ వ్యక్తి కర్మకాండలకు వచ్చి మద్యం తాగి బోడ హరిదాసు (60), బోడ మల్సూరు (60), బోడ భద్రు (36) అనే వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ముగ్గురు మృతిపై ఆదివారం మృతుల కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన బోడ చిన్నా అనే వ్యక్తి మద్యంలో విషం కలిపి ఇవ్వడంతోనే ముగ్గురు మృత్యువాత పడ్డారని తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు బోడ చిన్నాతో పాటు అతని తండ్రిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
ఖమ్మంలో పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత ముగ్గురి మృతదేహాలు బందోబస్తు మధ్య ఆదివారం పోలీసులు చంద్రుతండాకు తీసుకువచ్చారు. దీంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యంలో విషం కలపడం వల్లే ముగ్గురు మృతిచెందారని వారికి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సతీశ్, ఎస్.రఘు సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మృతుల అంత్యక్రియలు జరిగాయి. పాత కక్షల కారణంగానే ముగ్గురు మృతిచెంది ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రెండు దశాబ్దాల నుంచి కొన్ని కుటుంబాల మధ్య ఉన్న భూతగాదాలు ఉన్నందునే జరిగిందనుకుంటున్నారు. మరోవైపు ఇటీవల గ్రామంలో ఒక వర్గానికిచెందిన వ్యక్తి మృతిచెందగా మరోవర్గం వారు చేతబడి చేయించడం కారణంగానే మృతిచెందాడని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారు. దీనిపై కూసుమంచి సీఐ సతీశ్‌ను వివరణ కోరగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు.