గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. యువతీ యువకులు కేక్‌లు కట్ చేసి కేరింతలు కొడుతూ నూతన వత్సరాన్ని స్వాగతించారు. బైక్‌లతో ర్యాలీలూ తీస్తూ సంబురంగా వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించి మురిసిపోయారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేశారు. ఏడాదంతా సుఖసంతోషాలతో గడిచిపోవాలని, పాడిపంటలతో తులతూగాలని భక్తిభావంతో మొక్కుకున్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీఆర్ఆర్ శ్రేణులతో కలిసి తన నివాసం వద్ద కేక్ కట్ చేశారు. కార్యకర్తలు తరలివచ్చి అజయ్‌కి విషెస్ చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా పార్టీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. వారికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్