మామిళ్లగూడెం, మే 12: స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ప్రలోభాలు, ఒత్తిడులు, భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 53, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 40 ఫ్లయింగ్‌స్వాడ్ టీంలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పటిష్ట నిఘా చేపడుతున్నాయని పేర్కొన్నారు. వీటికితోడు 21 ఎస్ఎస్టీ టీంలు, 37 ఎంసీసీ టీం, 203 మంది సెక్టార్ అధికారులు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల వ్యయ నోడల్ అధికారులు, వ్యయ పరిశీలకులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. జిల్లాలో నగదు జప్తు విషయమై పలు కేసులు నమోదు చేశామన్నారు. కూసుమంచి మండలం దేవునితండా వద్ద ఓ పార్టీ వారు ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్న రూ.99.94 లక్షలను నిఘా అధికారులు జప్తుచేసి కేసు నమోదు చేశారన్నారు. మధిర మండలం నారాయణపురం వద్ద ఇంకో పార్టీ వారు రూ.1.70 లక్షలు పంపిణీకి తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.
మధిరలో మరో పార్టీ వారు ఓటర్లకు నగదు పంచుతుండగా పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. మధిరలో ఇంకో పార్టీకి చెందిన వారు ఓటర్లకు పంచడానికి తరలిస్తున్న రూ.4,29,500ను, ఖమ్మం వన్‌టౌన్‌లో ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్న రూ.45,650ను, కారేపల్లిలో ఓటర్లకు పంచడానికి మరో పార్టీ వారు తీసుకెళ్తున్న రూ.3,46,500లను పట్టుకొని జప్తు చేసి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సంబంధిత అభ్యర్థులపై కేసు నమోదు చేస్తామని, నగదు, మెటీరియల్, వాహనాలు జప్తు చేస్తామని, కఠిన చర్యలు చేపడతామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛతో, నైతికతతో ఓటు వేయాలని కోరారు.