‘అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎక్కడా లేదు.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు సైతం ఓ మెడికల్ కాలేజీని ఇచ్చారు.. అడిగిందే తడవుగా పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జిల్లా వైద్యారోగ్య శాఖ భవనాలను అప్పగించారు.. ఏమాత్రం ఆలోచించకుండా వాటి ఆధునీకరణకు రూ.11.06 కోట్లు కేటాయించారు.. ఆయా నిధులతో అనుకున్న విధంగా కొత్త మెడికల్ కాలేజీని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశాం.. ఈ నెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కళాశాలలను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.. దీనిలో భాగంగానే ఈ నెల 14న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం మెడికల్ కాలేజీ(కేఎంసీ)ని సందర్శించి అందుబాటులోకి తీసుకురానున్నారు’ అని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు అన్నారు. జిల్లా సార్వజనీన ఆసుపత్రికి అనుసంధానమైన వైద్య కళాశాల ప్రారంభోత్సవ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కచ్చితంగా రాష్ట్రంలోని నూతన మెడికల్ కాలేజీల్లో ఖమ్మం నంబర్‌వన్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఖమ్మం, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో పనులన్నీ పూర్తి చేశాం. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకం, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ సహకారం మరువలేనిది. అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు సూచనలు చేశారు’ అని ఖమ్మం మెడికల్ కళాశాల (కేఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు అన్నారు. ఈనెల 15న వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
నమస్తే : ఖమ్మం మెడికల్ కళాశాల గురించి చెప్పండి?
ప్రిన్సిపాల్ : తెలంగాణలో మెడికల్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. దానిలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరిన వెంటనే ఖమ్మానికి కాలేజీని కేటాయించారు. అన్ని జిల్లాల్లో స్థలాల సర్వే, నిధుల కేటాయింపు విషయమై తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎంతో విశాలమైన పాత కలెక్టరేట్ భవన సముదాయాన్ని అప్పగించారు. బాలికలు, బాలుర వసతి గృహాల కోసం పాత ఆర్అండ్బీ, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాలను ఇచ్చారు. ఇంతటి వసతి తెలంగాణలోని కొత్త మెడికల్ కళాశాలలకు ఎక్కడా కానరాదు. కచ్చితంగా ఖమ్మం మెడికల్ కళాశాల నంబర్‌వన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నమస్తే : ఆధునీకరణ పనులు ఎంతవరకు వచ్చాయి?
ప్రిన్సిపాల్ : ఖమ్మం మెడికల్ కళాశాలకు కేటాయించిన భవనాలు పాతవే అయినప్పటికీ ఎంతో పటిష్ఠంగా ఉన్నాయి. వాటి ఆధునీకరణకు కోరిన వెంటనే రూ.11.06 కోట్ల నిధులు కేటాయించారు. వాటిల్లో దాదాపు రూ.8 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టాం. తరగతి గదులు, ప్రొఫెసర్స్ గదులు, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, హాస్టల్స్, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ పూర్తయ్యాయి. కాలేజీకి అవసరమైన కంప్యూటర్స్, ఫర్నిచర్, ఇతర అన్నిరకాల ఎక్విప్మెంట్స్ ఇప్పటికే వచ్చాయి. అంతర్గతంగా లైటింగ్ పనులు పూర్తికాగా.. బయట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. కళాశాల, హాస్టల్స్ ప్రాంగణాల్లో రహదారుల నిర్మాణం సైతం చివరి దశలో ఉంది.
నమస్తే : అడ్మిషన్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?
ప్రిన్సిపాల్ : తెలంగాణ కోటాలో భాగంగా ఖమ్మం మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. మొత్తం వంద సీట్లకు గాను కాళోజీ నారాయణరావు మెడికల్ విద్యలో 85 సీట్లు, జాతీయ కోటాలో 13 కలిపి 98 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడతలో మిగిలిన రెండు సీట్లను భర్తీ చేస్తారు.
నమస్తే : మెడికల్ కాలేజీని ఎప్పుడు ప్రారంభిస్తారు?
ప్రిన్సిపాల్ : తెలంగాణలోని తొమ్మిది మెడికల్ కళాశాలలను ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్ పర్చువల్గా ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం మెడికల్ కళాశాలకు రానున్నారు. వారి చేతులమీదుగా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ రోజు వరకు అన్నిరకాల ఆధునీకరణ పనులు పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాము.
నమస్తే : తరగతులు ఎప్పటి నుంచి నిర్వహిస్తారు?
ప్రిన్సిపాల్ : తెలంగాణలోని నూతన మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే తరగతులు ప్రారంభమవుతాయి. వారం రోజులపాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్ విద్యార్థులకు ఎతికల్, అవుట్ స్టడీ బిహేవియర్ తదితర అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఆ తర్వాత అక్టోబర్ మొదటి తారీఖు నుంచి మెడికల్ విద్యార్థులకు పూర్తిస్థాయి తరగతులు నడుస్తాయి. అయితే ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం అమల్లోకి వస్తుందని గమనించాలి.
నమస్తే : మెడికల్ కాలేజీకి అవసరమైన యంత్రాంగం ఉందా?
ప్రిన్సిపాల్ : ఖమ్మానికి ఎప్పుడైతే మెడికల్ కళాశాలను మంజూరు చేశారో, తక్షణమే దానికి అవసరమైన యంత్రాంగాన్ని భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేసింది. దానిలో భాగంగానే ఆరుగురు ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 32 మంది సీనియర్ డెసిడెంట్స్ను కేటాయించింది. వారు ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ఇటీవలే వివిధ విభాగాల్లో అవసరమైన 32 మంది కిందిస్థాయి సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చాము. త్వరలోనే భర్తీ చేస్తాం. అన్ని విభాగాల్లో కలిపి మరో 31 మంది రావాల్సి ఉన్నది.
నమస్తే : మెడికల్ కాలేజీ వల్ల ప్రజలకు జరిగే మేలేంటి?
ప్రిన్సిపాల్ : ఖమ్మం జిల్లా ప్రజలకు కచ్చితంగా మేలు జరుగుతుంది. జిల్లా సర్వజనీన ఆసుపత్రిలో ఇప్పటివరకు వైద్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి ఉండదు. వైద్యుల స్థానంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తారు. వారితోపాటు వంద మంది వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటారు. వారంతా కలిసి 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తారు. ప్రతి కేసు విషయంలో కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సామాన్య ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు స్థానికంగా అందనివన్నీ ఖమ్మంలోనే సాక్షాత్కరిస్తాయి.
నమస్తే : రోగులకు ఏ విధంగా సేవలు అందిస్తారు?
ప్రిన్సిపాల్ : మెడికల్ కళాశాల అని ప్రకటించిన తర్వాత జిల్లా సర్వజనీన ఆసుపత్రికి ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకు ఓపీ వస్తున్నది. భవిష్యత్‌లో రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో 25 బెడ్లకు ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశాము. ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఇతర సిబ్బందిని కలిపి మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశాము. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఒక విభాగాన్ని ఎంచుకుని అన్నివిధాలా పరిశీలిస్తాము. వైద్యసేవలు, వారికి అందిస్తున్న వసతులు, ఇతర అన్నిరకాల పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటాము. హైదరాబాద్ గాంధీ తరహాలో ఖమ్మం జిల్లా ప్రజలకు సర్వీసు అందిస్తాము.
నమస్తే : స్థానిక సహకారం ఎలా ఉంది?
ప్రిన్సిపాల్ : ఖమ్మం మెడికల్ కళాశాల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పూర్తి అవగాహన ఉన్నది. ఆయన చొరవ, పట్టుదల కారణంగానే కళాశాల మంజూరైంది. పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాల సుముదాయాలను అప్పగించడంలో ఆయన కృషి అమోఘం. అదేవిధంగా అతి తక్కువ సమయంలో కళాశాల అందుబాటులోకి రావడంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ నిరంతర పర్యవేక్షణే కారణం. తరచుగా సందర్శించడం, ఎప్పటికప్పుడు సమీక్షించడం, మా అందరికీ దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించారు. మంత్రి, కలెక్టర్ కారణంగానే అతితక్కువ సమయంలో మెడికల్ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది.
నమస్తే : ప్రొఫెసర్లు, సిబ్బంది పనితీరుపై నియంత్రణ ఎలా?
ప్రిన్సిపాల్ : తెలంగాణ వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో వైద్యుల పనితీరుపై రోజువారీగా దృష్టి సారించారు. ఖమ్మం మెడికల్ కళాశాలలో సైతం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు , సీనియర్ రెసిడెంట్స్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ బయోమెట్రిక్‌తోపాటు ఫేస్ అటెండెన్స్‌ను అమలు చేస్తాము. అదేవిధంగా ఆసుపత్రితోపాటు మెడికల్ కళాశాలలో అడుగడుగునా సీసీ పుటేజీలను ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీ చర్యలు తీసుకున్నాము. మరోసారి చెబుతున్నా ఖమ్మం మెడికల్ కళాశాల తెలంగాణలో నంబర్‌వన్‌గా నిలవడం ఖాయం.