కారేపల్లి, సెప్టెంబర్ 05 : ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాలకు నిర్వహిస్తున్న బస్ సర్వీసులు ఎప్పుడూ వస్తాయో, ఎప్పుడు రద్దు అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఖమ్మం నుండి గాదెపాడు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసు వారం రోజులుగా నడవడం లేదన్నారు. వెంటనే బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్ సర్వీసులు పెంచకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైందని, గ్రామ పంచాయతీలకు నిధులు లేక పారిశుధ్య పనులు చేపట్టడం లేదన్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారులు, లింక్ రహదారులు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కరపటి సీతారాములు, కల్తీ రామచంద్రయ్య, పాయం వెంకన్న, కరపటి లక్ష్మయ్య, సాగపోయిన లక్ష్మయ్య, కరపటి సీతమ్మ, పాయం ఎర్రయ్య పాల్గొన్నారు.