ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. ఆదివారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫస్టియర్లో రాష్ట్రస్థాయిలో జనరల్ విభాగంలో జిల్లా నాలుగో స్థానంలో, సెకండియర్లో ఆరో స్థానంలో నిలిచింది. నిరుటితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం ద్వితీయ సంవత్సరంలో నాలుగు శాతం పెరగ్గా.. ప్రథమ సంవత్సరంలో ఒక శాతం పెరిగింది. గడిచిన సంవత్సరాల్లో అద్భుత ఫలితాలను సాధిస్తుండగా ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరగ్గా.. రాష్ట్రస్థాయిలో గతంతో పోలిస్తే జిల్లా ర్యాంక్ ఒకటి తగ్గింది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఎప్పటిలాగానే బాలికలే తమ హవా కొనసాగించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో సైతం బాలురుతోపాటు బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చి సత్తా చాటుకున్నారు. ప్రథమ ఇంటర్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 72.06 కాగా ద్వితీయంలో 81.66 శాతం సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి కే.రవిబాబు తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 72.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఫస్టియర్లో 15,299 మంది విద్యార్థులకు గాను 11,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 7,618 మందికి 4,981 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,681 మందికి 6,044మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 2190 మందికిగాను 1,321 మంది ఉత్తీర్ణులై 60.32 శాతం ఫలితాలు సాధించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ విభాగంలో 14,627 మంది విద్యార్థులకు 11,936 మంది ఉత్తీర్ణులై 81.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 7,282 మందికి 5,498 మంది పాసైయి 75.50 శాతం, బాలికల విభాగంలో 7,345 మందికి 6,438 మంది పాసై 87.65 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానం కైవసం చేసుకుంది. ఒకేషనల్ విభాగంలో 1,928 మందికి 1,429 మంది ఉత్తీర్ణత సాధించి 74.12 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు.
కొత్తగూడెం గణేశ్టెంపుల్, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లాలో ప్రథమ సంవత్సరం 63.49 శాతం, ద్వితీయ సంవత్సరం 77.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 51.78 శాతం, బాలికలు 71.96 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 83.45 శాతం, బాలురు 69.40 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పబ్లిక్ పరీక్షలు మే 13 నుంచి రెండు సెషన్లలో ప్రారంభమవుతాయని, ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ సంబంధిత జూనియర్ కళాశాలల్లో ఆదివారం నుంచి ఈ నెల 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.