ఖమ్మం అర్బన్, మే 17: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్‌సెట్-2026) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్‌లో 8, 39, 54, 60, 77, 84, 85, 95వ ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాతిని మరోసారి ఇనుమడింపజేశారు. ఇంజినీరింగ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంకులతో మనోళ్లు మెరిశారు. ‘ఫలితాలు ఏవైనా ర్యాంకులు మావే’ అనేలా ఆదివారం నాటి ‘తెలంగాణ ఎప్‌సెట్-26’ ఫలితాల్లో విజయఢంకా మోగించారు.
ఇంటర్, జేఈఈ ఫలితాల్లో సత్తా చాటినట్లే, ఎప్‌సెట్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపి జిల్లా విద్యా పరిమళాలను రాష్ట్ర నలుదిక్కులా వ్యాపింపచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఖమ్మం జిల్లా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగిన ఆన్లైన్ ఎప్‌సెట్-2026లో ఖమ్మం జిల్లా నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 15,174 మంది, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ విభాగంలో 6,730 మంది, భద్రాద్రి జిల్లా నుంచి ఇంజినీరింగ్‌లో 1,138 మంది, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ విభాగంలో 568 మంది హాజరయ్యారు.
ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ తర్వాత ఖమ్మానికి పేరుంది. ఆ పేరును ఎప్పటికప్పుడు జిల్లా విద్యార్థులు నిలుపుతూనే వస్తున్నారు. ఈసారి ఎప్‌సెట్-26 ఫలితాల్లోనూ 100లోపు ఎనిమిది ర్యాంకులు సాధించి ‘అదరహో’ అనిపించారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో 50లోపు ర్యాంకు రాలేదు. ఎప్‌సెట్-26లో రెండంకెల్లోపు ర్యాంకులతో ప్రైవేట్ కళాశాలలు సత్తా చాటాయి. జిల్లాలోని విద్యార్థులు హైదారాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివి 100లోపు ర్యాంకులు సాధించిన వారు ఉన్నారు. నేరుగా ఖమ్మంలోని కళాశాలల్లో చదివి 8, 39, 54, 60, 77, 84, 85, 95 వంటి ఉత్తమ ర్యాంకులను ఎప్‌సెట్-26లోనే నమోదు చేశారు. ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులతో రాణించగా.. జేఈఈ ఫలితాల్లో అదేస్థాయిను కొనసాగించారు. తాజాగా విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లోనూ ఆశించిన ఫలితాలతో విజయభేరి మోగించిన విద్యార్థులు, విద్యాసంస్థల బాధ్యులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.
ఎప్‌సెట్-26 ఫలితాల్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు తమ హవాను కోనసాగించాయి. శ్రీచైతన్యలో 8వ ర్యాంకును సాయిచరణ్, 60వ ర్యాంకును అక్షయ్గుణ, 85వ ర్యాంకును అక్షర సాధించినట్లు చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. న్యూవిజన్ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో 54వ ర్యాంకును జీవన్, 84వ ర్యాంకును లోకేశ్, తనుష్‌నాయక్ 95వ ర్యాంకును సాధించినట్లు చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ తెలిపారు. కృష్ణవేణి విద్యార్థులు 39వ ర్యాంకును శిశిర్సాయి, 77వ ర్యాంకును లక్ష్మి సాధించినట్లు డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు వివరించారు.