రఘునాథపాలెం, జనవరి 4: జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయం అంటేనే ఏజెంట్లతోనే పని. ఏజెంటు లేకుండా ఏ పనీ ముందుకు కదలదు. అసలు ఫైలు ఆఫీస్ దాగా వెళ్లాలంటే కర్త, కర్మ, క్రియ అంతా ఏజెంటే. డ్రైవింగ్ లైసెన్స్‌ను మొదలుకొని వాహనం రిజిస్ట్రేషన్, బ్రేక్ వంటి ఏ పనులైనా సరే.. అందుకు ముందుగా కార్యాలయానికి అవసరమైన ఫైల్(పేపర్లు) సిద్ధం చేయాలంటే వాహనదారుడు ఏజెంటును ఆశ్రయించాల్సిందే. ఏసీబీ దాడులకు ముందు రోజు వరకు కార్యాలయంతోపాటు బయట ఉన్న ఏజెంట్ల ఆఫీస్‌లు నిత్యం జాతరను తలపించాయి.
ఆర్టీవో ఆఫీస్, లోపల బయట సందడి వాతావరణం కనిపించేది. అంతేకాదు.. ఆ సమయంలో రోజూ కార్యాలయానికి వాహనాల పనులకు చెందిన ఫైళ్లు కుప్పలుతెప్పలుగా వస్తుండేవి. ఆ వచ్చే ఫైళ్లపై ఓ ప్రైవేటు వ్యక్తి ‘కోడ్’ వేయడంతో అధికారులు వాటికి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చేవారు. ఈ విషయాన్ని దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు గుర్తించారు కూడానూ..! ఇలా పచ్చజెండా ఊపిన ఫైళ్ల రూపేణా అధికారులకు వచ్చే ‘కాసుల’కోసం కార్యాలయంలో ముద్రణ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు, ఇతర పత్రాలు తిరిగి ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తుండేవి. ఏసీబీ దాడుల సమయంలో ఆర్టీవో ఆఫీస్‌లో ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు, ఇతర విలువైన వాహనపత్రాలు వేల సంఖ్యలో ఏజెంట్ల వద్ద పట్టుబడటం అధికారుల అవినీతికి అద్దం పట్టినైట్లెంది. ఈ విషయం ఏసీబీ దాడులతోనే తేటతెల్లమైంది.
ఇటీవల జిల్లా రవాణాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్ ట్రైనింగ్‌లో భాగంగా వెళ్లారు. దీంతో ఇన్చార్జి బాధ్యతలను కార్యాలయంలో సీనియర్ ఎంవీఐగా ఉన్న వాకదాని వెంకటరమణకు అప్పగించారు. కొత్త బాస్ ట్రైనింగ్‌లో ఉన్న సమయంలో కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఆకస్మిక దాడిచేసింది. ఈ క్రమంలో ట్రైనింగ్ అనంతరం కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీటీవో జగదీశ్ కార్యాలయాన్ని ప్రక్షాళన దిశగా తీసుకెళ్లి ఏజెంట్ల వ్యవస్థకు చెక్ పెట్టేనా..? అనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
ఏసీబీ దాడి తర్వాత మూడురోజులు ఆర్టీవో ఆఫీస్ ఏరియాలో ఏజెంట్లు మచ్చుకైనా కానరాలేదు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. గత రెండురోజులుగా ఏజెంట్ల కార్యాలయాలను మళ్లీ తెరుచుకొని పనులు షరా‘మామూలు’గానే వాహనదారుల పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీవో ఆఫీస్ వద్ద ఏజెంట్ల హడావుడి యధావిధిగానే సాగుతోంది. ‘వాహన్’ యాప్ వచ్చినప్పటి నుంచి ఏ పని కావాలన్నా అందులో నైపుణ్యం కలిగిన ఏజెంట్లను ఆశ్రయిస్తేనే పనులు సులువుగా అవుతాయనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఏసీబీ దాడుల తరువాత మూడురోజులు కార్యాలయానికి వచ్చే ఫైళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పనులు చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ వాహనదారులకు నూతన ‘యాప్’లో స్లాట్ చేసుకునే విధానం తెలియకపోవడం వల్ల పనులను వాయిదా వేసుకున్నారు. దీంతో దాడికి ముందు వరకు నిత్యం వందల సంఖ్యలో ఆఫీస్ చేరే ఫైళ్ల సంఖ్య.. ఆ మూడురోజులు మాత్రం కేవలం 10లోపుగానే వచ్చాయి.