భద్రాద్రి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎదిగిందని, ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు అని ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలో విలేకర్లతో నిర్వహించిన ఇష్ఠాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదుకు ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు మానుకోట పార్లమెంటరీ స్థానంలోనూ విజయ బావుటా ఎగురవేస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వము చేసిందన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎదిగిందని, ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు అని ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలో విలేకర్లతో నిర్వహించిన ఇష్ఠాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదుకు ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు మానుకోట పార్టమెంటరీ స్థానంలోనూ విజయ బావుటా ఎగురవేస్తామన్నారు.
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వము చేసిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మున్ముందు ఆయన జాతీయ రాజకీయాలను పెను మార్పులు తీసుకొస్తారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నే సంక్షేమ పథకాలను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతున్నారన్నారు. సమష్టిగా పనిచేస్తూ రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు.
ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..
అర్హులలైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వెల్లడించారు. పోడు భూముల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపుతుందన్నారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. పోడు భూముల సర్వే పూర్తయిన వెంటనే అర్హులకు హక్కు పత్రాలు అందుతాయన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌తో పాటు తెలంగాణకే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆయన ఏ రాష్ర్టానికి వెళ్లినా తెలంగాణ తరహా పాలన కావాలన్న డిమాండ్ ముందుకు వస్తున్నదన్నారు.
కేసీఆర్ పూర్తి సమర్థత, రాజకీయ పరిణతి గల నాయకుడన్నారు. ఆయన నిర్ణయం,ఆదేశాల తనకు శిరోధార్యమన్నారు. పార్టీ అధిష్ఠానం పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని ఆదేశిస్తే చేస్తారా..? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘పార్టీ నిర్ణయంచిన మేరకు నడచుకుంటా..’నని రేగా సమాధానమిచ్చారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలోని గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ బృహత్తర కార్యాచరణ ప్రకటించారన్నారు. ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు కట్టిస్తామన్నారు.