సారపాక, అక్టోబర్ 20 : రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకూ (టీఆర్ఎస్)బీఆర్ఎస్తోనే సమన్యా యం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో బూర్గంపహాడ్ మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ జెండానే శ్రీరామరక్ష అన్నారు. పార్టీలో శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తమ పాలన సాగుతుందని, ప్రజలకు రాష్ట్రంలో ఏ లోటు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని, సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో మంది నిరుపేదలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి సర్వే జరుగుతుందన్నారు. కొన్ని పార్టీలు బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని, ఆ క్రమంలో బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, దీనికి బీఆర్ఎస్ భయపడదని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తిరుగులేని హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోతుందన్నారు. సమావేశంలో మణుగూరు, బూర్గంపహాడ్ జడ్పీటీసీలు పోశం నర్సింహారావు, కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, పొడియం నరేందర్, కొనకంచి శ్రీనివాసరావు, మేడిగం లక్ష్మినారాయణరెడ్డి, మండలంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, నాయకులు పాల్గొన్నారు.