సత్తుపల్లి, అక్టోబర్ 20: ఒక్కసారి కిడ్నీలు పాడైతే అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి కొందరు నెలకు ఒకసారి, వారానికి ఒకటి రెండుసార్లు రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సిందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఉమ్మడి జిల్లాకు చెందిన బాధితులు గతంలో డయాలసిస్ కోసం హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లేవారు. రూ.వేలకు వేలు ఖర్చు పెట్టేవారు. కొందరు ఉన్న ఆస్తులను అమ్ముకున్న ఘటనలూ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46కు పైగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఉభయ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాలు…
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే నాలుగు డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రుల్లోని ఈ కేంద్రాల్లో నెలనెలా వందలాది మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వం ఇటీవల అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికీ డయాలసిస్ కేంద్రం మంజూరు చేసింది. అక్కడ త్వరలోనే సేవలు ప్రారంభంకానున్నాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో సత్తుపల్లి ఆస్పత్రిలో ఐదు డయాలసిస్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.
కిడ్నీ బాధితులకు అండగా..
కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తు న్నది. ఆసరా పథకం ద్వారా నెలకు ఒక్కొక్కరికీ రూ.2,016 చొప్పున పింఛను అందజేస్తున్నది. ఉచితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్పాస్ అందిస్తున్నది. డయాలసిస్ కేంద్రాల్లో వైద్యసిబ్బంది సింగిల్ యూజ్ పరికరాలను వినియోగించి డయాలసిస్ చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీ దవాఖానకు చెందిన వైద్యులు నెలకోసారి బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి డయాలసిస్ కేంద్రంలో 55 మంది, ఖమ్మం ఆస్పత్రిలో 120 మంది, భద్రాచలంలో 65 మంది, కొత్తగూడెంలో 53 మందికి పైగా నెలనెలా డయాలసిస్ చేయించుకుంటున్నారు.
డయాలసిస్ సేవలు బాగున్నాయి..
నాకు చిన్న వయస్సులోనే కిడ్నీలు పాడయ్యాయి. ప్రైవేటు దవాఖానల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం సత్తుపల్లిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించింది. నేను వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా. వైద్యులు కిడ్నీ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం మాకు పింఛనూ అందజేస్తున్నది.
– గోపి, పెద్దగొల్లగూడెం,దమ్మపేట మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా..
కొత్తగూడెంలోని ప్రభుత్వాసుపత్రిలో నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. గతంలో హైదరాబాద్లో డయాలసిస్ చేయించుకునే వాడిని. ఖర్చులు భారీగా అయ్యేవి. వైద్య చికిత్స కోసం ఎన్నో అప్పులు చేశాను. కొత్తగూడెంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటయ్యాక బాధలు తప్పాయి. వైద్యులు సూచించిన రోజు వచ్చి ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నా. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
– ఎస్ విద్యాసాగర్,పాల్వంచ
కిడ్నీ రోగులకు వరం..
సత్తుపల్లిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో మాకు వ్యయప్రయాసలు తగ్గాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.వేలకు వేలు ఖర్చవుతుంది. సత్తుపల్లి డయాలసిస్ కేంద్రంలో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా కిడ్నీ బాధితులను ఆదుకుంటున్నారు. కిడ్నీ బాధితులకు ఉచితంగా బస్పాస్ అందజేస్తున్నారు.
– కృష్ణ, రామానగరం,సత్తుపల్లి మండలం
కష్టాలు తప్పాయి..
నాకు కిడ్నీ సంబంధిత జబ్బు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంతో నాకు కష్టాలు తప్పాయి. ఇక్కడ వైద్యసిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నాలాగే జిల్లావ్యాప్తంగా ఎంతోమంది వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారందరికీ వ్యయప్రయాసలు తప్పాయి. కిడ్నీ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛనూ అందిస్తుండడంతో ఆర్థిక భరోసా లభిస్తున్నది.
– ఎండీ బీబీ, చండ్రుగొండ