ఖమ్మం, అక్టోబర్ 16: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో చెరువులు బలోపేతం అయ్యాయి. హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో ఏటా ఆశించినంత వర్షపాతం కురుస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, వాగులు, వంకలపై చెక్ డ్యాంల నిర్మాణం, చిన్న, మధ్య తరహా ప్రాజెక్ట్‌ల నిర్వహణతో భూగర్భజలాలు దండిగా పెరిగాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. బావులు, బోర్లలో నీళ్లకు కొదవలేదు. ప్రస్తుతం 3,680 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వీటి పరిధిలో 2,30,623 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఆయకట్టు పరిధిలో రైతులు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుములు సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి సాగవుతున్నది. ఇప్పటికే జిల్లాలోని చెరువులు అలుగు పోస్తున్నాయి. చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా జిల్లాలోని 2.50 లక్షల ఎకరాలు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 76,197 ఎకరాలకు నీరు అందుతున్నది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరడంతో యాసంగి సాగుకూ సాగునీటికి కొదువ లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వరప్రదాయిని భక్తరామదాసు ఎత్తిపోతల..
పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన రైతులు పూర్తిగా వర్షాధార పంటలనే సాగు చేయాల్సిన పరిస్థితి. కూసుమంచి మండలానికి చెందిన రైతులు సాగర్ జలాలపై ఆధారపడి వరి సాగు చేస్తారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని 13 గ్రామాల పరిధిలో 23,418 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఇక్కడి రైతులు ఎక్కువగా వరి, మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తారు. తిరుమలాయపాలెం మండలంలో 28,433 హెక్టార్ల భూమి ఉండగా ప్రస్తుతం 13,941 హెక్టార్లలో మాత్రమే పంటలు పండుతున్నాయి. మిగిలిన 10,402 హెక్టార్ల భూమికి వర్షమే ఆధారం. ఇక్కడి రైతులు ఎక్కువగా కంది, మొక్కజొన్న, పెసర, మిర్చి, పత్తి పంటలు పండిస్తారు. మండలంలోని 14 గ్రామాల పరిధిలో 16,246 ఎకరాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. నేలకొండపల్లి మండలంలో 34 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా దీనిలో 23 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, అపరాలు పండుతున్నాయి.
భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మండలంలోని ముటాపురం, రాజేశ్వరపురం, వెంకటగిరి తండా పరిధిలోని 1,500 ఎకరాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని 47,877 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం 31,887 ఎకరాల్లో మాత్రమే వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు పండుతున్నాయి. భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని 12 గ్రామాల పరిధిలో 12,605 ఎకరాలకు జలాలు పారుతున్నాయి. వీటితో పాటు ముదిగొండ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 2,440 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని రెండు గ్రామాల పరిధిలో 1,220 ఎకరాలకు భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందుతున్నది. ఇలా మొత్తం 45 గ్రామాల పరిధిలోని 58,958 ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి.