ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నాయి. అభ్యర్థులకు తాగునీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యంతోపాటు ఇతర అన్ని వసతులు సమకూర్చారు. పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్లాలనే రూట్ మ్యాప్ అభ్యర్థులకు తెలిసే విధంగా ముందే పరీక్షా కేంద్రం చూసుకొనే విధంగా ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులకు కేంద్రాల గుర్తింపు సులువైంది. ఒకే పేరు మీద ఉన్న కేంద్రాల విషయంలో అవి ఎకడెకడ ఉన్నాయి అనే దానిపై స్పష్టత ఇచ్చేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలో బోర్డులు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ హాజరు తీసుకున్న తరువాత అభ్యర్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతిచ్చారు. ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలను తెరిచి ఉంచడంతో అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. గదుల లే అవుట్ మ్యాప్‌లు కేంద్రంలో అభ్యర్థులకు అవగాహన ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో తమ హాల్ టికెట్ నంబర్లు, గదుల నంబర్‌ను చూసుకున్న అభ్యర్థులు వెంటనే పరీక్ష హాల్లోకి వెళ్లిపోయారు.
దివ్యాంగులకు ప్రత్యేకంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆయా సెంటర్లలో గదులను కేటాయించడంతోపాటు పరీక్ష విధులు నిర్వహించిన పలువురు అధికారులు, సిబ్బంది వారికి సహాయ సహకారాలు అందించారు. అధికారికంగా ఉదయం 10:15 నిమిషాలకు పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతించిన అధికారులు తిరిగి పరీక్ష ముగిసిన మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే బయటకు పంపించారు. గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటుతోపాటు భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంతో అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు జరగలేదు. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది.
అభ్యర్థుల హాజరు వివరాలు ఇలా….
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 17,366 మంది అభ్యర్థులకు 13,428 మంది పరీక్ష రాశారు. వారిలో 3,938 మంది వివిధ కారణాలతో గైర్హాజరు కాగా 77.32 శాతం మంది హాజరయ్యారు. 10:15 నిమిషాలు వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
నిరంతరం పర్యవేక్షణలో..
కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. కలెక్టర్ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అదనపు కలెక్టర్లు ఎన్.మధుసూదన్, స్నేహలత మొగిలి, అదనపు డీసీపీలు డాక్టర్ శభరీష్, సుభాష్‌చంద్రబోస్‌తో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణతోపాటు ఏసీపీలు, సీఐలు పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో 6,611 మంది హాజరు
గ్రూప్-1 పరీక్ష రాసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,851 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా 6,611 మంది పరీక్షకు వచ్చారు. 2,240 మంది గైర్హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఒరిజినల్ ఐడీ కార్డు, హాల్‌టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 327 గదుల్లో పరీక్ష రాశారు. 12మంది జిల్లా అధికారులు ైప్లెయింగ్ స్కాడ్లుగా విధులు నిర్వహించారు. 11 మంది ఎంపీడీవోలు, ఐదుగురు తహసీల్దార్లు, 23 మంది డీటీలు, 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 381 మంది ఇన్విజిలేటర్ల ద్వారా పరీక్ష నిర్వహించారు.
కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
లక్ష్మీదేవిపల్లి మండలంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీ సెంటర్‌ను కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. ఇన్విజిలేటర్లు, లైజన్ ఆఫీసర్లతో మాట్లాడి వారికి సూచనలు చేశారు. కొత్తగూడెం వన్‌టౌన్ స్టేషన్లో పశ్నాపత్రాలను పంపే తీరును పరిశీలించారు. ఎస్పీ వినీత్ అన్ని కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఉద్యోగులు కూడా ఉన్నత ఉద్యోగం కోసం పరీక్ష రాశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
అభ్యర్థులకు పోలీస్ సిబ్బంది సాయం
పరీక్షా కేంద్రాల అడ్రస్‌లు తెలియక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులకు అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సాయం అందించారు. బోనకల్ మండలం నుంచి వచ్చిన ఓ అభ్యర్థి మహిళా డిగ్రీ కళాశాల వద్దకు వచ్చి తన సెంటర్ గాంధీనగర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాల చిరునామా తెలియక ఇబ్బంది పడుతుంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మదార్ వెంటనే స్పందించి సదరు అభ్యర్థిని ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి చేర్చారు. చివరి నిమిషంలో సహకారం లభించి పరీక్షా కేంద్రంలోకి అనుమతి లభించడంతో అభ్యర్థి ఊపిరి పీల్చుకున్నాడు. అదేవిధంగా ఖమ్మం నయాబజార్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందకు వచ్చిన ఓ దివ్యాంగ అభ్యర్థిని విధులు నిర్వహిస్తున్న ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ స్వయంగా వీల్‌చైర్‌పై తీసుకపోయి అభ్యర్థికి కేటాయించిన పరీక్ష గది వరకు చేర్చారు.