సత్తుపల్లి టౌన్/రామవరం, అక్టోబర్ 16 : సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సత్తుపల్లి బొగ్గు గనులు గుండెకాయ లాంటివని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో సింగరేణి జీఎం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో వెలికితీస్తున్న బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు చొరవ చూపాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సత్తుపల్లి ప్రాంతంలో అధికారులు ప్రాంతాభివృద్ధితో పాటు నిర్వాసితులల అవసరాలు తీర్చాలన్నారు. పారిశ్రామిక ప్రగతిలో సత్తుపల్లి ప్రాంత రైతులు సైనికుల్లా సహకరించారని, వారికి అందించాల్సిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లాభాలు గడించే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దుష్టచర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి సంస్థగా అన్నారు. ఇటీవల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సత్తుపల్లిలో జీఎం కార్యాలయం ప్రారంభించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవం లోపు కార్యాలయాన్ని మంజూరు చేయడం ఆనందించదగిన విషయమన్నారు.
అనంతరం డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సత్తుపల్లి ప్రాంత బొగ్గు గనుల నుంచి రాబోయే రోజుల్లో మరింత బొగ్గు వెలికితీత జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 14వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా వెలికితీత పనులు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం వైస్ ప్రెసిడెంట్ రజాక్, పాలడుగు శ్రీనివాస్, కిష్టారం సర్పంచ్ రేణుక, ఎంపీటీసీ సభ్యులు సునీత, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జేవీఆర్ఓసీ పీవో వెంకటాచారి, కిష్టారం ఓసీ పీవో నర్సింహారావు, ఏజీఎం సూర్యనారాయణ, కొత్తగూడెం ఏరియా ఇంజినీర్ రఘుపతిరెడ్డి, సెక్యూరిటీ అధికారి రమణారెడ్డి, అధికారులు రవీందర్, మొక్కపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం జీఎం కార్యాలయాన్ని తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను సింగరేణి అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు.