చింతకాని/ మామిళ్లగూడెం, మార్చి 8: దళితుల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు ఫలాలు అందుతాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మండలంధిలోని వందనం గ్రామం ఎస్సీకాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. దళితుల స్థితిగతులను పరిశీలించి వారికి కావాల్సిన యూనిట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ‘దళితబంధు ఉద్దేశం – ఆవశ్యకత – ప్రయోజనాల’ గురించి దళితులకు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున లాటరీ పద్ధతిలో ఇచ్చే రుణాల్లా కాకుండా.. దళితులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా, వారి జీవన దశ తిరిగేలా దళితబంధు ద్వారా రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. ధ్రువపత్రాల కోసం దళితులు ఎక్కడికీ వెళ్లవద్దని, అధికారులకే లబ్ధిదారుల ఇళ్లకు వస్తారని చెప్పారు. ఇందుకోసం గ్రామానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించామన్నారు. సర్పంచ్ సునిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, ప్రత్యేకాధికారి షకీలాభాను, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ కిశోర్ పాల్గొన్నారు.
దళితబంధు అమలుకు ప్రతి నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని, లబ్ధిదారుల అనుభవం, ఆసక్తి మేరకు యూనిట్ల స్థాపనకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని షెడ్యూల్డు కులాల అభివృద్ధి సంస్థ కార్యదర్శి రాహుల్ బొజ్జ జిల్లా కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాల ప్రారంభం తదితర అంశాలపై మంగళవారం అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తయిందన్నారు.