కూసుమంచి, అక్టోబర్ 14: కూసుమంచి మండలం కూరగాయల సాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. గతంలో వాణిజ్య పంటలు, సాధారణ పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సాధారణ పంటలు పండిస్తూనే కొంతభూమిలో కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూసుమంచి, కేశ్వాపురం, ధర్మాతండా, కొత్తతండా, చింతల్‌తండా, లోక్యాతండా, జీళ్లచెరువులో వీటి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. దశాబ్దం నుంచి క్రమంగా వాణిజ్య పంటలను తగ్గిస్తూ కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయోగాత్మకంగా సరికొత్త వంగడాలను పండిస్తూ విజయం సాధిస్తున్నారు. ఎక్కువగా చిక్కు డు, బీర, గోరుచిక్కుడు, కాకర, తెల్ల కాకరకాయ, టమాటా, సొరకాయ, వంకాయ, దోసకాయ, పచ్చి మిచ్చి, క్యాబేజీ సాగు చేస్తున్నారు. కొందరు బోడ కాకర, పొట్ల కాయ సాగు చేస్తున్నారు. ఆకు కూరల్లో బచ్చలకూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, పొన్నగంటి కూర, సిరి కూర, ఉల్లి ఆకు పండిస్తున్నారు. ఖమ్మంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లో అమలవుతున్న ధరల ఆధారంగా రైతులు రేటు నిర్ణయించి సంతలో విక్రయిస్తున్నారు. సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన చిన్న కొట్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు.
తిరుమలాయపాలెంలో మంగళవారం వా రాంతపు సంత, సోమవారం కూసుమంచి, బుధవారం నాయకన్‌గూడెం, శుక్రవారం పా లేరు, శనివారం పిండిప్రోలు సంతల్లో కూరగాయలు విక్రయిస్తున్నారు. వారు స్వయంగా పండించే పంటలే కాక ఖమ్మం కూరగాయల మార్కెట్ నుంచి క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికం, ఆలుగడ్డ, అల్లం, వెల్లుల్లిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. కొందరు గ్రామగ్రామానికి సైకిళ్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లి కూరగాయలు విక్రయిస్తున్నారు.