మామిళ్లగూడెం, అక్టోబర్ 14 : జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ ప్రత్యేక సాధారణ సమాశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 20 మండలాల్లోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 2కోట్ల 29 లక్షల 50వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. పీహెచ్సీల్లో అవసరమైన ప్రతిపాదనల్లో భాగంగా 11 పీహెచ్సీల్లో అకడి పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపాదనలకు నిధులు విడుదలయ్యాయన్నారు.
వాటిలో చింతకాని-10.40 లక్షలు, బోనకల్-11.60 లక్షలు, కూసుమంచి-13.50, మాటూరుపేట-15.20, వేంసూరు-18.20 మంచుకొండ-24.20, లంకాసాగర్- 25.10, ఏనూరు-25.10, కామేపల్లి-26:80, వైరా-26.90, తల్లాడకు 33.10 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. కూలిపోయే దశలో ఉన్న బనిగండ్లపాడు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూ.1.56 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో జరిగే ప్రతి సమావేశానికి అధికారులు స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలకు ముందుగానే సమాచారాన్ని అందించాలని.. అప్పటికప్పుడు చెప్పే విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు. పలువురు వైద్యులు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ముదిగొండ, వైరా, బోనకల్, వేంసూరు, కారేపల్లి తదితర మండలాలకు చెందిన పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, పంచాయతీరాజ్ ఈఈ కేవీకే శ్రీనివాసరావు, డిప్యూటీ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.