మణుగూరు టౌన్, అక్టోబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో భగవాన్దాస్ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు, అశ్వాపురం మండలం మొండికుంట నుంచి రెండు కుటుంబాల వారు మణుగూరు క్యాంపు కార్యాలయంలో రేగా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, దళితబంధు పథకాలు ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఆళ్లపల్లి, అక్టోబర్ 14: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆళ్లపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. వారికి రేగా కాంతారావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, రామాంజిగూడెం సర్పంచ్ నిర్మల, మర్కోడు ఉప సర్పంచ్ కమల, మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, మండల నాయకులు కిశోర్, ఖయ్యూం, ప్రవీణ్, సతీశ్, ఆదాం, కృష్ణ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుక్రవారం సందర్శించారు. పనులు పూర్తికావడంతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు టీఆర్ఎస్ నాయకుడు ఊకంటి గోపాల్రావు ఉన్నారు.