ఖమ్మం సిటీ, అక్టోబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఖమ్మం జిల్లాలో బోదకాలు (పైలేరియా) నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, ఈ నెల 20, 21, 22 తేదీల్లో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి తెలిపారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోదకాలు క్యూలెక్స్ దోమ కుట్టడం వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. ఎక్కువగా పురుషులే ఈ వ్యాధి బారిన పడతారని దోమలు పుట్టకుండా, కుట్టకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నిర్ణీత తేదీల్లో తమ సిబ్భంది ఇంటింటికీ తిరుగుతూ డీఈపీ, ఆల్బెండజోల్తోపాటు ఐరన్ మాత్రలు అందించి, వాటిని ఏ విధంగా మింగాలో తెలియజేస్తారని చెప్పారు. జాయింట్ డైరెక్టర్ తుకారాం మాట్లాడుతూ శనివారం రోజున ఆశా కార్యకర్తలు, గ్రామ లీడర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బోదకాలు వ్యాప్తి, నివారణ గురించి డాక్టర్ వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రాంబాబు, జిల్లా మలేరియా అధికారి సంధ్య, వైద్యాధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.