భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): పాడి పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పాడి రైతుల నుంచి విజయ డెయిరీ ద్వారా పాలు సేకరింపజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాకు చెందిన పాడి రైతులు విజయ డెయిరీ అందిస్తున్న ప్రోత్సాహకాలు అందిపుచ్చుకుని లబ్ధి పొందుతున్నారు. ఇల్లెందు, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని 50 పాల సేకరణ కేంద్రాల్లో ప్రతిరోజు డెయిరీ సిబ్బంది సుమారు 10 వేల మంది ద్వారా ఆవు, గేదె పాలను సేకరిస్తున్నారు. ఆటోల ద్వారా కేంద్రాల పాలను మిల్క్ సెంటర్‌కు తరలిస్తున్నారు. డెయిరీ అధికారులు వచ్చే నెల నుంచి మరో 35 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 85 కేంద్రాల్లో పాలు సేకరించనున్నారు. ప్రస్తుతం పాడి రైతుకు ఒక లీటర్ పాలకు రూ.73 చొప్పున అందిస్తున్నారు. మరో నాలుగు శాతం ప్రోత్సాహకాన్ని (ఇన్సెంటివ్) రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. డెయిరీ సిబ్బంది ప్రతిరోజు సుమారు 1,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు.
పాడి రైతుల పిల్లలకు ప్రోత్సాహకాలు..
పాడి రైతు పిల్లలు పదో తరగతిలో 9 జీపీఏ సాధిస్తే రూ.వెయ్యి, ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు సాధిస్తే రూ.2 వేలు, ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో సీటు సాధిస్తే రూ.2 వేలు, అఖిల భారత సర్వీస్‌లో ఉద్యోగం సాధించిన వారికి రూ.10 వేల చొప్పున విజయ డెయిరీ నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది.
రైతులకు ప్రోత్సాహకం..
రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీతో అనుసంధానమై పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తున్నది. పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఏర్పాటు చేసింది. డెయిరీ ల్యాబ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి అనేక సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నది. 2019 లోపు పేర్లు నమోదు చేసుకున్న 193 మందికి సబ్సిడీపై గేదెలు, ఆవులు అందించింది. ఒక లీటర్ పాలకు పాడి రైతులు డెయిరీ రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నది. ప్రైవేటు డెయిరీల కంటే విజయ డెయిరీ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నది.
వ్యవసాయానికి అనుబంధంగా
పాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండడంతో రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ వైపు ఆకర్షితులవుతున్నారు. గేదెలు, ఆవులను పోషిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా ఎంపీ బంజర, రెడ్డిపాలెం, లక్ష్మీపురం, బయ్యారం, సుజాతనగర్, కొత్తగూడెం ప్రాంతాల నుంచి ఎక్కువగా పాల సేకరణ జరుగుతున్నది. బూర్గంపహాడ్ మండలంలోని ఒక్క ఎంపీ బంజరకు చెందిన పాడి రైతులు ప్రతిరోజు 500 లీటర్ల పాలను డెయిరీకి అందిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇలా..
పాడి పశువుల కొనుగోలుకు రూ.10 వేల రాయితీ
పశువుల బీమాకు రూ.వెయ్యి మంజూరు
పశువులకు కృత్రిమ గర్భాధారణ సదుపాయం
అధిక శాతం ఎస్ఎస్ఎఫ్ కలిగిన పాలకు ప్రీమియం ధర
విజయ పెండ్లి కానుక పథకం ద్వారా పాడి రైతు కుటుంబానికి రూ.5 వేలు కానుక
బల్క్ మిల్క్ సెంటర్లలో ఎక్కువ పాలు పోసే వారికి రూ..2116 నగదుతో పాటు ప్రశంసా పత్రం
1500 లీటర్లు అంతకన్నా ఎక్కువ పాలు పోసే రైతులకు రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు, పాలక్యాన్లు, దాణా, మినరల్ మిక్చర్ అందజేత
పాడి రైతు మృతిచెందితే అంతిమ సంస్కారాలకు రూ.5 వేల లక్షణ సాయం.
పాడి రైతులకు ప్రోత్సాహకాలు..
పాడి రైతులకు విజయ డెయిరీ ప్రోత్సాహకాలు అందిస్తున్నది. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పాల సేకరణ, విక్రయాల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తాం. మున్ముందు భద్రాద్రి జిల్లాలో మరిన్ని పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ సత్యనారాయణ, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, కొత్తగూడెం