కూసుమంచి, అక్టోబర్ 8: ఇక ప్రయాణికుల కష్టాలు తప్పాయి. సమయం ఆదా కానున్నది. గతుకుల రోడ్లకు కాలం చెల్లింది. హైవేపై హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే 95 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. గతనెల 25వ తేదీ నుంచి జాతీయ రహదారుల విభాగం అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. లోటుపాట్లను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నారు. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు ప్రారంభమవుతాయి. పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సూర్యాపేటకు కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఒకప్పుడు ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్లలాంటే సుమారు 60 కి.మీ ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేది. రెండు వరుసల రోడ్డుపై అక్కడక్కడా గుంతలు ఉండేవి. కిలోమీటర్ల మేర రాళ్లు తేలేవి. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మించాలని కేందాన్ని కోరింది. నాటి రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఎన్‌హెచ్ 365 బీబీ రహదారిగా 2020లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చొరవతో కలెక్టర్ వీపీ గౌతమ్ నిత్య పర్యవేక్షణలో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటికే 95 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. గత నెల 25వ తేదీ నుంచి జాతీయ రహదారి అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. లోటుపాట్లను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నారు. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు ప్రారంభమవుతాయి.
భూముల ధరలకు రెక్కలు..
కూసుమంచి మండలంలోని రాజుపేట, జుఝల్రావుపేట, నేలకొండపల్లి, నేలపట్ల వైపు అండర్ పాసింగ్ రోడ్లు ఏర్పాటయ్యాయి. వచ్చే డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ వెల్లడిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు రేయింబవళ్లు పని చేస్తున్నారు. వందలాది కార్మికులు నిర్మాణ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో భూముల రెక్కల ధరలు వచ్చాయి. ఎకరా భూమికి గతంలో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల ధర పలికేది. ఇప్పుడు ఆ ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నది. రహదారి ఆనుకొని ఉన్న భూములకు ఎక్కువగా, సర్వీస్ రోడ్లకు లోపల ఉన్న భూములకు కాస్త ధర తక్కువగా ఉంది.
నిర్మాణం ఇలా..
సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి నుంచి చివ్వెంల వరకు బైపాస్ నిర్మించగా అక్కడి నుంచి చివ్వెంల, మోతె, నాయకన్‌గూడెం, పాలేరు, కూసుమంచి, జీళ్లచెరువు, పొన్నెకల్లు వరకు 58.63 కి.మీ ఫోర్ లైన్ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాలేరు జలాశయం వద్ద బైపాస్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనులు ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి కావాల్సి ఉండగా కొవిడ్, వర్షాల కారణంగా కాస్త జాప్యం జరిగింది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని జాతీయ రహదారి అధికారులు వెల్లడిస్తున్నారు. కల్వర్టుల వద్ద ఆరు లైన్ల రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.
జాతీయ రహదారి నిర్మాణ విశేషాలు..