ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 8: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం దంచికొటి్ంటది. ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాలు, ఆయా మండల కేంద్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఊహించని విధంగా ఖమ్మం నగరంలో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. గ్రామాలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి ఓసీలో ఉత్పత్తి పూర్తిగానిలిచిపోయింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వానకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకూ వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి.
అల్ప పీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. అప్పటి వరకూ మోస్తరుగా, అక్కడక్కడా జల్లులుగా కురిసిన వర్షం.. శనివారం సాయంత్రం ఐదు గంటలకు మొదలై సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. దీంతో ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాలు, ఆయా మండల కేంద్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వారం రోజులుగా కొంత తెరపినిస్తూ కురుస్తున వర్షం.. శనివారం సాయంత్రం మాత్రం దట్టమైన మేఘాలతో దంచికొట్టింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఊహించని విధంగా నగరంలో అతి భారీ వర్షం కురవడంతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీనికి తోడు పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి ఓసీలో పూర్తిగా నిలిచిపోయింది. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఆందోళనలో పత్తి, మిర్చి రైతులు..
వానకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకూ వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చెరువులు నెలల తరబడి అలుగులు పోస్తూనే ఉన్నాయి. గడిచిన వారం రోజుల నుంచి కూడా వద్దంటే వస్తున్న వర్షాలను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తీత దశలో ఉన్న పత్తి పంట చేజారిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుగుతున్న మిర్చి పంట వర్షపు నీటిలో ఉండడంతో ఆ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
వారం రోజులుగా భద్రాద్రి జిల్లాను కూడా వర్షం ముంచెత్తుతోంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో 40 మిల్లీ మీటర్లకు తగ్గకుండా వర్షపాతం నమోదవుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అశ్వారావుపేట మండలంలో ఓ ఇల్లు కూలిపోయింది. దమ్మపేటలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.