భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : దేశ ప్రజల సమస్యలే బీఆర్ఎస్ అజెండా అని, ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే దేన్నైనా సాధించి తీరుతారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆనాడు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని చివరికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. బీజేపీ పాలనలో రైతులు, ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, విద్య, వైద్యం, పేద పిల్లలకు ఉచిత విద్య, రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. ఇలాంటి పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే దసరా పండగ నాడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని, దేశ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రోల్‌మోడల్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపు అన్ని రాష్ర్టాలు చూస్తున్నాయని, చివరికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఇక్కడి పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. దేశాన్ని అన్నపూర్ణగా మార్చే ప్రధాని కావాలన్నారు. భావిభారత ప్రధానిగా అన్నివిధాలా అర్హుడు కేసీఆరేనని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని కేసీఆర్ సవాల్‌గా తీసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా, అరుణ, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, బరపటి వాసుదేవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, లక్ష్మీదేవిపల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కొట్టి వెంకటేశ్వర్లు, శ్రీనగర్ ఉపసర్పంచ్ లగడపాటి, సుజాతనగర్ బీఆర్ఎస్ కార్యదర్శి సత్యనారాయణ, జగన్, కౌన్సిలర్లు, భీమా శ్రీధర్, రావి, రాంబాబు, ఎంఏ రజాక్, మల్లెల ఉషారాణి, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.