రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, హోంగార్డులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచింది. తాజాగా పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు తీపికబురు అందించింది. మరోసారి 30 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం వేతనం రూ.8,500 నుంచి రూ.11,050కు చేరుకున్నది. గతంలో చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడేవారు. గోపాలమిత్రలు 2014 నుంచి రూ.3,500 వేతనం అందుకున్నారు. 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందుకుంటున్నారు. మళ్లీ జీతం పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చిన తర్వాత కర్షకులు, కార్మికులు, ఉద్యోగుల కష్టాలను సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, హోంగార్డులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచారు. తాజాగా పశుసంవర్ధకశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గోపాల మిత్రలకు మరోసారి 30 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం వేతనం రూ.8,500 నుంచి రూ.11,050కు చేరుకున్నది. ఉమ్మడి పాలనలో గోపాల మిత్రలు నెలకు కేవలం రూ.2 వేల గౌరవ వేతనం అందుకున్నారు. చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకోలేక వారు ఇబ్బంది పడేవారు. 2014 నుంచి రూ.3,500 వేతనం అందుకున్న గోపాలమిత్రలు 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందుకుంటున్నారు. మళ్లీ జీతం పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రమను గుర్తిస్తున్న ప్రభుత్వం..
ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. వారి శ్రమకు తగిన వేతనాన్ని అందిస్తున్నది. పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని వేతనాలు పెంచుతున్నది. దీనిలో భాగంగా గోపాలమిత్రలకు కానుకగా 30శాతం వేతనాన్ని పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 60 మంది లబ్ధి పొందనున్నారు. గోపాలమిత్రలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వీరు పశుసంవర్ధకశాఖలో 2002 నుంచి పనిచేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే క్షేత్రస్థాయికి వెళ్లి పశువుల సంరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, పశువులకు కృత్రిమ గర్భధారణ, టీకాలు, వ్యాధుల నివారణ గురించి వివరిస్తున్నామని గోపాలమిత్రలు తెలిపారు. ఉమ్మడి పాలనలో ఉంటే తమ వేతనం రూ.4 వేలైనా దాటేది కాదని, స్వరాష్ట్రం వచ్చాకే తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మా సేవలను గుర్తిస్తున్నది..
మా సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తున్నది. మేము చాలా ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెండుసార్లు వేతనాన్ని పెంచారు. వేతనం పెంపు మాకెంతో ఆనందాన్నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమాన్ని పట్టించుకుంటున్నది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కున్సోస్ ప్రసాద్, గోపాలమిత్రల సంఘం జిల్లా కోశాధికారి, తిప్పనపల్లి
శ్రమను గుర్తించిన నేత కేసీఆర్..
గోపాల మిత్రలుగా మేం 22 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం. మా శ్రమను సీఎం కేసీఆర్ గుర్తించారు. ఉద్యమ నేతగా ఆయనకు అందరి కష్టాలు తెలుసు. ఒక్కోవర్గం కష్టాలను ఒక్కోసారి తీరుస్తున్నారు. మాకు ఇప్పటికే రెండు సార్లు వేతనం పెంచారు. మాకు అండగా నిలబడుతున్నారు. ఉమ్మడి పాలనలో కేవలం రూ.2 వేలు గౌరవ వేతనం తీసుకున్న మేము ఇప్పుడు రూ.11,050 తీసుకుంటున్నాం.
-వాక రాజారావు, గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, మణుగూరు