రఘునాథపాలెం, అక్టోబర్ 7: రఘునాథపాలెం మండలం నూతన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏర్పాట్లు సన్నద్ధమవుతున్నాయి. మండలాల విభజనలో భాగంగా రఘునాథపాలెం నూతన మండలంగా ఏర్పాటైంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్మాణం పూర్తయి అధికారులు పాలనా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కాగా, మండలానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఆయా కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. మండల పరిషత్‌కు ఆనుకొని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు. కార్యాలయాల నిర్మాణంపై దృష్టి సారించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నూతన కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. కాగా, నూతన తహసీల్ కార్యాలయం, పోలీస్ స్టేషన నిర్మాణానికి ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లను శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. పనులను పరిశీలించిన వారిలో తహసీల్దార్ నర్సింహారావు, పీఆర్ ఏఈ ఆదిత్యరాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరమణ, మాజీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మందడపు నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు, గుడిపూడి రామారావు, మందడపు సుధాకర్, మాధవరావు తదితరులు ఉన్నారు.