ఇల్లెందు, అక్టోబర్ 6: ఇల్లెందు పట్టణంలో జరిగిన దసరా ఉత్సవాలు మైసూర్ జాతరను తలపించాయని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి జేకే మైదానంలో బుధవారం రాత్రి జరిగిన దసరా ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఇల్లెందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే మైసూర్‌ను తలపిస్తున్నట్లుగా ఉందన్నారు.
ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అలరించాయి. చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.