భద్రాద్రి జిల్లాలో విస్తారంగా పత్తి సాగవుతున్నది.. రైతులు వానకాలంలో ఏకంగా 1.75 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.. పంటను తెగుళ్ల నుంచి బయట పడేసి అధిక దిగుబడి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.. ఈ నెల చివరి నాటికి పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లావ్యాప్తంగా నాలుగు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.. పత్తికి ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.6,380 పలుకుతుండగా పంట చేతికి వచ్చే సమయానికి ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతుందని రైతులు అంచనా వేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లావ్యాప్తంగా రైతులు వానకాలంలో పత్తి సాగుపై మొగ్గు చూపారు. ఏటికేడు సాగులో మెళకువలు తెలుసుకుని ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో తెగుళ్లను నివారిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.6.380 పలుకుతున్నది. పంట చేతికి వచ్చే సమాయానికి క్వింటా పత్తికి రూ.8 వేల నుంచి రూ.10 వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇక రైతుల ఇంట సిరుల ధారే.
ఈ ఏడాది రైతులు జిల్లాలో విస్తారంగా పత్తి సాగు చేశారు. అన్ని పంటల కంటే పత్తి సాగు విస్తీర్ణమే ఎక్కువ. 1,75,619 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఏటా పంటకు మద్దతు ధరలు పెరగుతుండడంతో రైతులు పత్తి సాగుపై దృష్టి సారించారు. ప్రభుత్వం సీజన్‌కు ముందే రైతుబంధు అందించడంతో రైతులకు పెట్టుబడి తిప్పలు తప్పాయి. సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందడంతో సాగు సాఫీగా సాగుతున్నది. వానకాలంలో సన్నకారు రైతులూ పత్తి సాగు చేశారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెగుళ్ల నివారణపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. దీనికి తోడు సకాలంలో వానలు కురవడం, చెరువులు నిండడంతో సాగునీటి ఇబ్బందులూ తప్పాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొంతమేర పంట నష్టం వాటిల్లినప్పటికీ రైతులు మెజార్టీ పంటను కాపాడుకునే పనిలో పడ్డారు.
వచ్చే నెల మొదటి వారం నుంచి సుజాతనగర్ మండలంలోని మంజిత్ కాటన్ మిల్, ఇల్లెందు పరిధిలోని (కారేపల్లి) శ్రీలక్ష్మి కాటన్ మిల్, బూర్గంపాడు పరిధి (లక్ష్మీపురం)లోని అనుశ్రీ కాటన్ మిల్, అశ్వాపురంలోని శ్రీలక్ష్మి కాటన్ మిల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఆయా యాజమాన్యాలు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పత్తిని ఆరబెట్టడానికి షెడ్లు నిర్మిస్తున్నాయి. రైతులకు తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తున్నాయి. సుజాతనగర్ మండలంలోని కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు ప్రారంభించారు.
గతేడాది మేము మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాం. పంటను గులాబీ రంగు పురుగు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఈ ఏడాది పురుగు బెడద లేదు. కొత్త రకం తెగులు వచ్చింది. వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. పంట చేతికి వచ్చే సమయానికి మంచి రేటు పలుకుతుందని ఆశిస్తున్నాం.
– కారం పద్మ, మహిళా రైతు, మైలారం
పత్తికి ఎప్పటికీ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. రైతులు జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి విక్రయించాలి. మిల్లుల్లో కాంటా ల్లో తేడాలు రావు. దళారులను నమ్మి మోసపోవద్దు. ఈసారి జిల్లావ్యాప్తంగా నాలుగు చోట్ల పత్తి విక్రయాలు చేపడతాం. వచ్చే నెల మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
– అబ్దుల్ అలీం, జిల్లా మార్కెటింగ్ అధికారి, కొత్తగూడెం