ఖమ్మం వ్యవసాయం/ ఆళ్లపల్లి/ పెనుబల్లి/ అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట టౌన్/ దుమ్ముగూడెం/ చండ్రుగొండ/ జూలూరుపాడు, అక్టోబర్ 6: బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఒకటే వాన. జిల్లా కేంద్రం ఖమ్మం నగరంలో ప్రధాన వీధులు జలమయమయ్యాయి. సత్తుపల్లి, మధిర, వైరా తదితర పట్టణాల్లో ప్రజలు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో సాయంత్రం వేళ వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వివిధ పనులపై బయటకు వెళ్లిన నగర వాసులు అసౌకర్యానికి గురయ్యారు.
సాయంత్రం వేళ కొద్ది సేపు ఒరుపు ఇవ్వడంతో ఉపశమనం పొందారు. పది రోజులుగా రోజంతా ఒరుపు ఇవ్వడం, రాత్రి వేళ వర్షం కురవడం జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) జిల్లా వ్యాప్తంగా 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 58.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుబల్లి మండలంలో 46.2, వేంసూరు మండలంలో 42.8, నేలకొండపల్లి మండలంలో 30.2, మధిర మండలంలో 35.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 15 – 25 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. దాదాపుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి వెళ్లి పోయిన తరువాత సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు వాపోతున్నారు. పంట పొలాల్లో నిలిచిన వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాను వర్షం ముంచెత్తింది. ఇల్లెందులో 38 మిల్లీ మీటర్లు, పాల్వంచలో 27, ఆళ్లపల్లిలో 26, టేకులపల్లిలో 27, దమ్మపేటలో 24, మందలపల్లిలో 23, కొత్తగూడంలో 20 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జల్లేరు, కోడెల, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఎగువన కురిసిన వర్షంతో మర్కోడు గ్రామంలోని జల్లేరుపై నిర్మించి చెక్డ్యాంపై భారీగా వరద నీరు ప్రవహించింది. వాగులు ఉప్పొంగడంతో మండలంలోని సీతానగరం, కర్నెగూడెం, చంద్రాపురం తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం – అబ్బుగూడెం, రాజాపురం – మర్రిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట పట్టణంలో బుధవారం రాత్రి నుంచి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దుమ్ముగూడెంలోనూ భారీ వర్షం కురిసింది. మండల కేంద్రమైన లక్ష్మీనగరంతోపాటు పలు గ్రామాల్లో వరదనీరు రోడ్లపైకి చేరింది. చండ్రుగొండ మండలం మద్దుకూరు శివారులో గల సీతారామ ప్రాజెక్టు కాలువ తెగిపోయింది. ఆ వరదంతా పంట పొలాల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో మిరప, వరి, ఇతర పంటలు సుమారు 40 ఎకరాల్లో నీట మునిగాయి. జూలూరుపాడు మండలంలో 14.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.