టీఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయికి విస్తరిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక సంచికను సిబ్బంది ఎన్నో ఇబ్బందులను అధిగమించి పాఠకుల చెంతకు చేర్చింది. వారి నుంచి మంచి ఆదరణ లభించింది
ఖమ్మం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): పాఠక దేవుళ్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ప్రజల మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్న ‘నమస్తే తెలంగాణ’ విజయదశమి సందర్భంగా మరో ముందడుగు వేసింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు బుధవారం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించగా ఆ విశేషాలను ప్రప్రథమంగా పాఠక లోకానికి అందించింది. టీఆర్ఎస్ ఆవిర్భావం, దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్‌పై జాతీయ నాయకుల అభిప్రాయాలు, ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర వంటి భిన్న కోణాలను స్పృశిస్తూ సమగ్రంగా.. సంపూర్ణంగా కథనాలను ప్రచురించింది. గురువారం తెల్లవారుజామున పాఠకుడి వద్దకు పత్రికను చేర్చి వారి అభిమానాన్ని చూరగొన్నది. ఖమ్మం జిల్లాతో పాటు పూర్తి ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి జిల్లాలోనూ పత్రికను ఇంటి లోగిళ్లకు చేర్చింది.