పెనుబల్లి, అక్టోబర్ 6 : దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొత్తకారాయిగూడెం, రామచంద్రరావుబంజరు, పెనుబల్లి తూర్పుబజారు, వీఎం బంజరు తదితర గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలను ఏర్పాటు చేశారు.సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పెనుబల్లి, అక్టోబర్ 6 : తొమ్మిది రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న అమ్మవారు గురువారం నిమజ్జనానికి తరలి వెళ్లారు. పలు గ్రామాల్లో కొలువు దీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా వీయం బంజరులోని రాజసాయి మందిరంలో నెలకొల్పిన అమ్మవారిని మేళతాళాలు, కోలాట నృత్యాల నడుమ ఊరేగించి నిమజ్జనం చేశారు.
సత్తుపల్లి, అక్టోబర్ 6 : దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద ఆలయకమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అద్దంకి అనిల్, ఉత్సవకమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, అక్టోబర్ 6 : కనకదుర్గా అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు గురువారం నిమజ్జనం చేశారు. మండలంలోని పండితాపురం, పింజరమడుగు గ్రామాల్లో పంచపాండవులను ట్రాక్టర్‌పై ఊరేగించారు. రుక్కితండాలో కనకదుర్గ మాలధారులు ఇరుముడులు సమర్పించి అమ్మవారిని ఊరేగించి నిమజ్జనానికి తరలించారు.
కారేపల్లి, అక్టోబర్ 6 : కారేపల్లి క్రాస్‌రోడ్, కారేపల్లి, లింగంబంజర, తొడిదలగూడెం, మాదారం గ్రామాల్లో కనకదుర్గామాతా విగ్రహాల నిమజ్జన వేడుకలు బుధవారం రాత్రి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కారేపల్లిక్రాస్రోడ్లో మండపం వద్ద ప్రెంఢ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం దుర్గామాత విగ్రహాలను గ్రామాల్లో ఊరేగించి గ్రామ శివారులోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు.
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 6 : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. గురువారం బేతుపల్లిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని అన్నదానం అనంతరం గ్రామ పురవీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి సమీపంలోని బేతుపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పాకలపాటి శ్రీనివాసరావు, ఉత్సవకమిటీ నిర్వాహకులు, సభ్యులు, భక్తులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.