ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 2: ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన బతుకమ్మ వేడుకలతో గ్రామాలు పూల వనాలయ్యాయి.. అవనిపై హరివిల్లులు విరిశాయి.. మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు.. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు.. అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.. ఇదే ఒరవడిలో సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు జరుగనున్నాయి.. మహిళలు పెరుగన్నం, సజ్జ ముద్దలు, ఎండు కొబ్బరి అన్నం, సత్తుపిండి, పులిహోర, చపాతి ముద్దలు, బియ్యం, నువ్వులు, పల్లీల పొడులు, మొక్కజొన్న సద్దులు నివేదించనున్నారు. అనంతరం నిమజ్జన ఘాట్లలో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.
బతుకమ్మ ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. మహిళలు పెరుగన్నం, సజ్జ ముద్దలు, ఎండు కొబ్బరి అన్నం, సత్తుపిండి, పులిహోర, చపాతి ముద్దలు, బియ్యం, నువ్వులు, పల్లీల పొడులు, మొక్కజొన్న సద్దులు తయారు చేసి గౌరమ్మకు నివేదిస్తారు. బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. అనంతరం సమీప జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. సోమవారం ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, పాలేరు, మధిర, వైరా పట్టణాల్లో వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఖమ్మంలోని కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ మున్నేరు వద్ద సందడి నెలకొననున్నది.
సందడిగా ‘వెన్న ముద్దల బతుకమ్మ’ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ‘వెన్నముద్దల బతుకమ్మ’ సంబురాలు జరిగాయి. మహిళలు వెన్న, నెయ్యి, బెల్లం, నువ్వులతో కలిపిన ప్రసాదాన్ని గౌరమ్మకు నివేదించారు. వాడవాడలా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. నగరంలోని పలు డివిజన్లతో పాటు టీఆర్ఎస్ భవన్ ఆవరణలో మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ సకల సౌభాగ్యాలు ప్రసాదించాలి: మంత్రి అజయ్..
సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటికి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా సుఖ సంతోషాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఉత్సవాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ప్రజలందరికీ గర్వకారణమన్నారు.