భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉన్న ఊర్లో ఉపాధి లేక.. తినడానికి తిండి లేక.. పిల్లలను పోషించుకోలేక.. అక్కడి పాలకులు వారిని పట్టించుకోకపోవడంతో వేలాది మంది గొత్తికోయలు రెండు దశాబ్దాల క్రితం వలస వచ్చారు.. మారుమూల గిరిజన గూడేల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నారు.. ఉపాధి లేక అల్లాడిపోయారు.. తాగునీటి కోసం చెలమలపై ఆధారపడ్డారు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకున్నారు.. వలస గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు.. గుర్తింపుకార్డులు ఇచ్చి వారిని రాష్ట్ర పౌరులను చేశారు.. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు.. మిషన్ భగీరథ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు.. ఇలా భద్రాద్రి జిల్లాలోని 75 వలస గ్రామాలు కొత్తరూపును సంతరించుకున్నాయి.. ఆయా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక కథనం
ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడం.. అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వేలాది గొత్తికోయల కుటుంబాలు తెలుగు రాష్ర్టాలకు వచ్చాయి. ఉమ్మడి పాలకులు వారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. కూలి దొరకడం కష్టమయ్యేది. తాగునీటికి వాగులపై ఆధారపడేవారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సంవత్సరాల తరబడి అంధకారంలోనే గడిపారు. తెలంగాణ వచ్చిన తర్వాతే వారి బతుకులు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఉపాధి కార్డులు ఇచ్చింది. ఇక్కడి గుర్తింపు కార్డులు ఇచ్చింది. వారు ఇప్పుడు రాష్ట్ర పౌరులయ్యారు. గొత్తికోయల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ గొత్తికోయలను అక్కున చేర్చుకున్నారు.
పొరుగు రాష్ర్టాల నుంచి వలస..
ఛతీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో బతుకుతున్నారు. చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, బూర్గంపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, కరకగూడెం, దమ్మపేట మండలాల్లోని 85 గ్రామాల్లో సుమారు 2 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 75 వలస గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తున్నది. 2020లో ఒక్కో సోలార్ యూనిట్‌కు రూ.8 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో రెండు యూనిట్లు నెలకొల్పింది. వాతావరణ ప్రతికూలతలు ఏర్పడినప్పుడు చేతిపంపు ద్వారా నీరు పట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. దీంతో గొత్తికోయల దాహార్తి తీరుతున్నది. మిగిలిన గ్రామాల్లోనూ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో వాగు నీరు తాగే వాళ్లం
మా కుటుంబం గట్టుమళ్ల వచ్చి 20 ఏళ్లు అయింది. అప్పుడు మాకు తాగునీటి వసతి లేదు. దగ్గర్లోని వాగుకు వెళ్లి చెలమలు తవ్వి నీరు తెచ్చుకునే వాళ్లం. ఉపాధి కూడా దొరికేది కాదు. దొరికిన పొలం పనులకు వెళ్లేవాళ్లం. సర్కార్ మాకు ఉపాధి కార్డులు. ఇచ్చింది. తాగునీటి యూనిట్లు ఏర్పాటు చేయడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించింది.
– కల్మం మాసె, గంగమ్మ కాలనీ, గట్టుమళ్ల,లక్ష్మీదేవిపల్లి మండలం
అన్ని వసతులు ఉన్నాయి
మేము పొరుగు రాష్ట్రం నుంచి వచ్చాం. అక్కడ పనులు లేక తెలంగాణకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాం. రాత్రిళ్లు కారు చీకట్లో ఉండేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. సోలార్ యూనిట్ల ద్వారా మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నది. మారుమూల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మడకం జోగమ్మ, గంగమ్మ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం