మధిరటౌన్, సెప్టెంబర్ 30: పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం అమ్మవారిని గజలక్ష్మీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకుడు శ్రీమాన్ శేషాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కపిలవాయి జగన్మోహన్రావు, భక్తులు పాల్గొన్నారు.
బోనకల్లు, సెప్టెంబర్ 30: దసరా పండుగ పురస్కరించుకొని మండలంలోని దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల్లో శుక్రవారం అమ్మవారికి మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చన పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మధిరరూరల్, సెప్టెంబర్ 30: మండలంలోని దెందుకూరు ఆంజనేయస్వామి ఆలయంలోని కనకదుర్గా అమ్మవారికి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 30: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని లలితపరమేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గోపూజ నిర్వహించారు. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి, భక్తులకు అమ్మవారి ప్రసాదాలు, కుంకుమ, శేషవస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కే.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, ఆలయ పర్యవేక్షకులు బీ.శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
చింతకాని, సెప్టెంబర్ 30: అన్నిదానాల్లో కల్లా అన్నదానం మహోన్నతమైనదని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్, ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ కోదండరామాలయంలో ఏర్పాటు చేసి అమ్మవారి పూజల్లో భాగంగా కమిటీ గ్రామపెద్దల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తుడుం రాజేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, పెంట్యాల చలమయ్య, తుళ్లూరి అచ్చయ్య, గుర్రం శ్రీనివాసరావు, గుర్రం రామారావు, చల్లా శంభులింగం, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.