భద్రాచలం, సెప్టెంబర్ 26: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలిరోజు అమ్మవారు లక్ష్మీతాయారమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేపట్టారు. మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. చిత్రకూట మండపంలో 108 మంది పారాయణులు శ్రీమద్రామాయణం పఠించారు. సూర్యప్రభ వాహనంపై ఉత్సవమూర్తులను మండపానికి తీసుకొచ్చారు. ఆస్థాన స్థానాచార్యుడు కేఈ స్థలశాయి, ఆలయ పండితులను దేవస్థానం ఈవో బానోత్ శివాజీ సత్కరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం అమ్మవారు సంతానలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు.