ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 21: ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (55) ఈనెల 19న ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్‌ను లిఫ్ట్ అడిగి గుర్తుతెలియని వ్యక్తి సూది మందు ఇవ్వడంతోనే జమాల్ సాహెబ్ మృతిచెందాడని వార్తలు బయటకు రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీనిపై రకరకాల వదంతులు, ఊహాగానాలు బయటకు వచ్చాయి.
వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ రెండు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి రూరల్ ఏసీపీ బస్వారెడ్డి వివరాలు వెల్లడించారు. బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ భార్య షేక్ ఇమామ్‌బీ ఇదే మండలంలోని నామవరానికి చెందిన ఆటోడ్రైవర్ గోదా మోహన్‌రావుతో అక్రమ సంబంధం నెరపుతున్నది. కొద్దిరోజుల క్రితం భర్తకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ఉండగా తాను అక్రమ సంబంధం కొనసాగించడం కష్టతరమని భార్య భావించింది. పథకం ప్రకారం భర్తను హతమర్చాలని నిర్ణయించుకున్నది.
భర్త హత్యకు రెండు నెల ముందు నుంచే రంగం చేస్తున్నది ఇమామ్‌బీ. అందుకు ప్రియుడు మోహన్‌రావు, అతని స్నేహితుడు, గ్రామీణ వైద్యుడు బండి వెంకన్న సాయం తీసుకున్నది. మనిషిని చంపే ఇంజెక్షన్ కావాలని గ్రామీణ వైద్యుడిని కోరి అతడికి రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. గ్రామీణ వైద్యుడు ఇంజెక్షన్ కోసం తన స్నేహితుడు పోరళ్ల సాంబశివరావును సంప్రదించాడు. సాంబశివరావు ఖమ్మం నగరంలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న బందెల యశ్వంత్‌కు విషయం తెలిపాడు. యశ్వంత్ ఓ ఇంజెక్షన్‌ను గ్రామీణ వైద్యుడు వెంకన్నకు అందించాడు. ఇంజెక్షన్‌ను మోహన్‌రావు ద్వారా ఇమామ్‌బీ అందించాడు. ఇమామ్‌బీ భర్తకు ఇంజెక్షన్ వేయడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది.
ఈ క్రమంలో సోమవారం భర్త ఏపీలోని తన కుమార్తె ఇంటికి వెళ్తున్నాడని ప్రియుడు మోహన్‌రావుకు ఆమె సమచారం అందించింది. అనంతరం భర్త కంటే ముందు ఆమె గండ్రాయికి చేరుకున్నది. భర్త బయల్దేరిన తర్వాత ప్రియుడికి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. ఇదే అదునుగా భావించిన ప్రియుడు, గ్రామీణ వైద్యుడు మరో వ్యక్తి నర్సిశెట్టి వెంకటేశ్‌తో కలిసి వల్లభి వద్ద కాపుకాశారు. వెంకటేశ్ రోడ్డు పక్కన ఉండగా అటుగా ద్విచక్రవాహనంపై జమాల్ సాహెబ్ వస్తున్నాడు. వెంకటేశ్ లిఫ్ట్ అడిగి జమాల్ సాహెబ్ నడుపుతున్న ద్విచక్రవాహనం ఎక్కాడు. వెంకటేశ్ కొన్ని నిమిషాల తర్వాత జమాల్ సాహెబ్‌కు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం నురగలు కక్కుతూ జమాల్ సాహెబ్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతంగా చేసి కేసును ఛేదించారు.
జమాల్ సాహెబ్ హత్య కేసులో పోలీసులు ఏ1గా మోహన్‌రావు, ఏ2గా ఆర్ఎంపీ బండి వెంకన్న, ఏ3గా నర్సిశెట్టి వెంకటేశ్, ఏ4గా ఇమామ్ బీ, ఏ5గా బందెల యశ్వంత్, ఏ6గా పోరళ్ల సాంబశివరావుగా కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి రెండు మోటారు సైకిళ్లు, ఆరు సెల్ఫోన్లు, ఉపయోగించని ఒక సిరంజ్ 1, ఉపయోగించిన ఒక సిరెంజ్ను స్వాధీనం చేసుకున్నారు.