ఆకలితో అల్లాడిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన దేవుడతడు. పొట్టకూటి కోసం వలస పోయిన తెలంగాణ ప్రజలను తిరిగి రప్పించి ఉపాధి కల్పించిన భగవంతుడతడు. స్వరాష్ట్ర రైతుల పంట పొలాల్లో పొరుగు రాష్ర్టాల కూలీలకూ పని కల్పించిన పెన్నిధతడు. ఆయనే మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన వేసిన సంక్షేమ బాటలు నేడు దేశానికి దిక్కులవుతున్నాయి. మట్టి మనుషుల కష్టాలు తెలిసిన మహానేత కాబట్టే రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశాడు. ప్రజా సంక్షేమాన్ని ప్రథమంగా భావించాడు కాబట్టే దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. వాటి ఫలాలను ప్రజల దరికి చేర్చాడు.
స్థానిక సంస్థలకు జవసత్వాలు పోశాడు కాబట్టే తెలంగాణ పల్లెలన్నీ నేడు పచ్చదనానికి పట్టుగొమ్మలయ్యాయి. స్వచ్ఛమైన రోడ్లు, పరిశుభ్రమైన గ్రామాలు దర్శనమిస్తున్నాయి. వివక్ష చూపిస్తున్న కేంద్రం నుంచే ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని, రైతుల కరెంటు వినియోగానికి మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చిన వేళ అన్నదాతల క్షేమం కోసం కేంద్రాన్ని ఎదిరించిన ధీరుడతడు.
కులమతాల మధ్య అంతరం పెంచేలా యత్నిస్తున్న కేంద్రంలోని మతతత్వ శక్తులను ఢీకొడుతున్న దీశాలి అతడు. అవును.. ఇప్పుడు కేసీఆర్ మనకు ముఖ్యమంత్రి మాత్రమే కాదు,దేశానికి దిక్సూచి. అందుకే ఆయన జాతీయ రాజకీయ తెరంగేట్రాన్ని రాష్ర్టాలకు అతీతంగా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ పల్లెలను పచ్చందాలతో తీర్చిదిద్దిన ఆయన.. దేశంలోని ప్రతి పల్లెనూ ప్రకాశింపజేస్తాడని చెబుతున్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. కేసీఆర్ ప్రధాని అయితే పల్లె వికాసం తథ్యమన్నది వారి అచెంచల విశ్వాసం. అందుకు కారణాలు వారి మాటల్లోనే..
-ఖమ్మం, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణప్రతినిధి)
దేశ రాజకీయాల్లోకి రావాలి
దేశంలో సుస్థిర పాలన అందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. పెరిగిన ధరలు నియంత్రించాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. ప్రజల ఇబ్బందులపై అవగాహన ఉన్న నాయకుడు కావాలి. అలాంటి నాయకుడే దేశానికి దశదిశ చూపగలరు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రధాని కావాలి. దేశంలో బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ప్రభుత్వ సంస్థలను బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెడుతున్నది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే కేసీఆర్ రావాల్సిందే.. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. తెలంగాణలో 5 వేల మంది కళాకారులకు పింఛన్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు ఆసరాతో భరోసా కల్పిస్తున్నారు. రైతుబంధు, బీమాతో ధీమా కల్పిస్తున్నారు.
– మధిర ఎంపీపీ మెండెం లలిత
దేశానికి తెలంగాణ మోడల్
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నది. ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశానికి మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే సంచలనాలు సృష్టిస్తారు. దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ అది కేసీఆర్‌తోనే సాధ్యమవుతున్నది. నిబద్ధత, నిజాయితీకి మారుపేరు కేసీఆర్. రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు. ప్రజా సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కారానికి బాటలు వేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే దేశాన్ని స్వర్ణయుగంగా మార్చే నాయకుడు కావాలి. నాడు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడం కోసం పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. కుల, మత, వర్గ విభేధాలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్ రావాలి.. దేశానికి దిశానిర్దేశం చేయాలి.
– పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ వేంసూరు
సమస్యలపై అవగాహన ఉన్న నేత
తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నది. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదు. పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కానీ, తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నది. గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలాంటి ఎన్నో పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. కేసీఆర్ ప్రధాని అయితే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చు.
-భూక్యా రాధ, టేకులపల్లి ఎంపీపీ
దేశ సంపద సృష్టి కేసీఆర్‌తోనే సాధ్యం
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగసంస్థలు రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, బొగ్గు గనులు, ఉక్కు ఫ్యాక్టరీలు, ఎల్ఐసీని కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నది. దీనివల్ల రూ.లక్షల కోట్లు విలువ చేసే ప్రజాధనం దోపిడీకి గురవుతున్నది. ఎంతో మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. జీడీపీ పతనమైంది. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దేశంలోనే అపారమైన సహజ వనరులున్నా.. వాటిని వినియోగించడంలో ప్రధాని నరేంద్రమోదీ పూర్తిగా విఫలమయ్యారు. అభివృద్ధి, సంపద సృష్టిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం శుభసూచికం.
దేశంలో వృథాగా పోతున్న నీరు, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయం, విద్యుత్ అవసరాలను తీర్చే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్యుత్ రంగాలు వృద్ధి చెందడం వల్ల పారిశ్రామిక ప్రగతి పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, ప్రజావ్యతిరేక విధానాలతో దేశం నష్టపోతున్నది. దేశంలో రైతులను వ్యవసాయానికి దూరం చేసి ఈ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నది. సాగుకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే కాకుండా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. ఇందుకు భిన్నంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేసి వారికి అండగా నిలిచారు.
– దొడ్డా శ్రీనివాసరావు, తల్లాడ ఎంపీపీ
కేసీఆర్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం
కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నది. కుల, చేతి వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. గిరిజనులు, ఆదివాసులకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటాం. నరేంద్రమోదీ హయాంలో దేశ సంపద అంబానీ, ఆదానీ చేతుల్లోకి వెళ్తున్నది. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది దేశానికే ప్రమాదకరం. కానీ, తెలంగాణ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కర్షకుల సంక్షేమానికి పాటుపడుతున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. బీజేపీ మతోన్మాద శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడగలిగిన నాయకుడు కేసీఆరే.
-బోడ మంగీలాల్, ఎంపీపీ తిరుమలాయపాలెం
దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడం శుభపరిణామం. దేశంలోని రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలోని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ దేశప్రజలకు అందించవచ్చు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా లభిస్తుంది. బీజేపీ పాలనలో దేశంలో నిత్యావసర సరకుల ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారాయి. బీజేపీ విద్యుత్ మీటర్లు పేరుతో రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నది. అందుకే కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది.
-వేల్పుల పావని, వైరా ఎంపీపీ
దేశమంతటా మన పథకాలు
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొని నిలబడే నాయకుడు ఎవరూ లేరు. మోదీకి కేసీఆర్ సరైన జవాబు ఇవ్వగలరు. అపార అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన ప్రధాని అయితే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశావ్యాప్తంగా అమలు చేస్తారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మేమంతా ఆయనకు మద్దతుగా నిలుస్తాం. ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేస్తాం.
-పూనెం లింగమ్మ, ఎంపీటీసీ, చల్లసముద్రం, ఇల్లెందు
బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు
దేశ చరిత్రను మార్చగల సత్తా సీఎం కేసీఆర్‌కు ఉంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న నేత. అభివృద్ది సంక్షేమ పథకాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉంది. ప్రధాని మోదీ పరిపాలనతో దేశప్రజలు విసిగిపోయారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన సమయం ఆసన్నమైంది.
-పూనెం సురేందర్, ఎంపీటీసీ, విజయలక్ష్మీనగర్, ఇల్లెందు
దేశానికి ఉజ్వల భవిష్యత్తు
తెలంగాణ సాధకుడు, అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సార్ రాక కోసం దేశ ప్రజలందరూ కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. దేశ రాజకీయాలను శాసించగల సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన వస్తే జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. దేశ ప్రజలు బీజేపీ పరిపాలనతో విసిగిపోయారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. పెరిగిన ధరలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశానికి దిశనిర్దేశం చేసే నాయకుడు కావాలి.
ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు, పరిష్కరించగల దమ్ముఉన్న నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు వస్తాయి. ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని దేశప్రజలు నమ్మకంతో ఉన్నారు.
– సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ
దేశానికి కేసీఆర్ విజన్ అవసరం
దేశంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై సీఎం చంద్రశేఖర్‌రావుకు మంచి విజన్ ఉంది. జలవనరుల వినియోగం, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, పంటల విక్రయాలపై నిర్ధిష్టమైన విధానాలు అమలు చేయడంతో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పయనిస్తున్నది. గత ప్రభుత్వాల మాదిరిగానే బీజేపీ ప్రభుత్వం కూడా రైతువ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకుండా పోతున్న ఈ దశలో కేసీఆర్‌లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. క్రియాశీలక పాత్రపోషించాలి.
-బజ్జూరి రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, నర్సింహులగూడెం, కూసుమంచి మండలం