మామిళ్లగూడెం, సెప్టెంబర్ 19: జిల్లాలో అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 అమలుపై ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 59 ఉత్తర్వును జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 ద్వారా 125 చదరపు గజాల లోపు నిర్మాణాలను క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. ఉత్తర్వు సంఖ్య 59 ద్వారా 125 చదరపు గజాలకుపైగా ఉన్న గృహాలు, వాణిజ్య సముదాయాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు కాకుండా కట్టడాలు ఉన్న వాటినే క్రమబద్ధీకరించాలని సూచించారు.
ఆ కట్టడాలు కూడా 2014 జూన్ 2లోపువై ఉండాలని అన్నారు. విచారణ సమయంలో విద్యుత్ బిల్లులు, ట్యాక్సుల చెల్లింపు రసీదులను రికార్డు చేసుకోవాలని, డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించాలని సూచించారు. ప్రతి రోజూ 25 కట్టడాల రికార్డు సేకరణ లక్ష్యంగా కార్యాచరణ చేయాలని ఆదేశించారు. రోడ్లు, చెరువులు ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను క్రమబద్ధీకరించొద్దని సూచించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియించామన్నారు. సెప్టెంబర్ 30లోపు రికార్డుల సేకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ వినతులకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్
గ్రీవెన్స్ వినతులకు ప్రాధాన్యమివ్వాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. ఈ వినతుల్లో ఎక్కువగా వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరు, ఉపాధి కల్పన వంటి అంశాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.