ఖమ్మం కల్చరల్, సెప్టెంబర్ 18: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశభక్తి గీతాలు, ఆధునిక గేయాలు హోరెత్తించాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపి గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్, రాధికా గుప్తా, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పదిమంది స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. జబర్దస్త్ బృందంలోని హైపర్ ఆది, నరేశ్, గణపతి, హరిత తదితరులు హాస్యపు స్కిట్స్‌తో కడుపుబ్బా నవ్వించారు. సినీ నేపథ్య గాయకులు సింహ, మోహన భోగరాజు, అతిథి భావరాజు, జయంత్‌లు అనేక దేశభక్తి, సినీ గీతాలను ఆలపించి మైమరిపించారు. సింహ బృందం ఆలపించిన ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి..’ అనే పాట ప్రేక్షకుల్లో దేశభక్తిని పెంపొందించింది. వయోలిన్ సంగీత విద్వాంసుడు అభిజిత్ బృంద సభ్యులు వాయిద్యాలతో గీతాలను ఆలపిస్తూ ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపర్చాయి. యాంకర్ శ్వేత సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యానం అకట్టుకుంది. నృత్య దర్శకుడు సంతోశ్ బృంద బాధ్యులు పలు సినీ గీతాల నృత్య ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. డిజిటల్ ప్రదర్శనలతో విద్యుత్ దీపాల వెలుగులతో భారీ వేదికపై సమైక్యకా సంబురాలు అంబరాన్నంటాయి.
ఖమ్మంలో జరిగిన సంబురాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర