ఆళ్లపల్లి, మార్చి 1: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసే టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయని అన్నారు. ఆళ్లపల్లి మండలం రామాంజిగూడెం పంచాయతీతోపాటు పలు గ్రామాలకు చెందిన 25 కుటుంబాల వారు సర్పంచ్ పూనెం నిర్మల, ఎంపీపీ కోండ్రు మంజుభార్గవి ఆధ్వర్యంలో విప్ రేగా కాంతారావు సమక్షంలో మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం, టీఆర్ఎస్పైనా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని, మోస పూరిత మాటలను నమ్మే స్థితిలో వారు లేరని స్పష్టం చేశారు. పార్టీ కోసం కలిసి కట్టుగా పనిచేస్తూ గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. జడ్పీటీసీ హనుమంతరావు, పీఏసీఎస్ చైర్మన్ గొగ్గెల రామయ్య, సర్పంచులు శంకర్‌బాబు, టీఆర్ఎస్ నాయకులు షేక్ బాబా, వేమూరి రాంబాబు, కిశోర్‌బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.